సెల్ సిగ్నల్స్ కోసం పాట్లు
ABN, First Publish Date - 2023-06-26T01:15:51+05:30
మండలంలో శివారు బలపం పంచాయతీ ప్రజలకు సెల్‌ఫోన్ కష్టాలు తీరడం లేదు. గ్రామ పంచాయతీ పరిధిలో 33 గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి రాలేదు. కేవలం ఎర్రగుప్ప అనే ప్రాంతంలో మాత్రమే సెల్ సిగ్నల్స్ అందుతాయి. దీంతో గ్రామ వలంటీర్లు, ఆదివాసీలు ఎటువంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివచ్చినా ఎర్రగుప్ప ప్రాంతానికి వచ్చి గంటల తరబడి సెల్‌ఫోన్లతో కుస్తీపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ పరిధిలో నూతనంగా జియో టవర్ నిర్మించినప్పటికి ప్రారంభం కాలేదు.
- 33 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు
- ఎర్రగుప్ప ప్రాంతానికి వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆదివాసీలు, వలంటీర్ల అవస్థలు
చింతపల్లి, జూన్ 25: మండలంలో శివారు బలపం పంచాయతీ ప్రజలకు సెల్‌ఫోన్ కష్టాలు తీరడం లేదు. గ్రామ పంచాయతీ పరిధిలో 33 గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి రాలేదు. కేవలం ఎర్రగుప్ప అనే ప్రాంతంలో మాత్రమే సెల్ సిగ్నల్స్ అందుతాయి. దీంతో గ్రామ వలంటీర్లు, ఆదివాసీలు ఎటువంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివచ్చినా ఎర్రగుప్ప ప్రాంతానికి వచ్చి గంటల తరబడి సెల్‌ఫోన్లతో కుస్తీపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ పరిధిలో నూతనంగా జియో టవర్ నిర్మించినప్పటికి ప్రారంభం కాలేదు. దీంతో ఆదివాసీలు, గ్రామ వలంటీర్లు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎర్రగుప్ప వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఎర్రగుప్పలోనూ పూర్తి స్థాయిలో సిగ్నల్స్ అందవు. సిగ్నల్స్ వచ్చిన సమయంలోనే గ్రామ వలంటీర్లు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వేలిముద్రల నమోదు తప్పనిసరి కావడంతో ఆదివాసీలు ఏ పథకం పొందాల్సి వచ్చినా గ్రామ వలంటీర్‌తో ఎర్రగుప్పకు వచ్చి వేలిముద్రలు వేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే చేయించుకునేందుకు ఆదివాసీలు పనులు మానుకుని ఎర్రగుప్ప వద్దకు వచ్చి గ్రామ వలంటీర్లతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రగుప్ప ప్రాంతంలో ఆదివాసీలతో రద్దీగా ఉంటోంది. ఆదివారం గ్రామ వలంటీర్లు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఎర్రగుప్ప వద్దకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఈవోఆర్‌డీ కొరుప్రోలు శ్రీనివాసరావు, కార్యదర్శి చిన్నంనాయుడు గ్రామ వలంటీర్లతో ఆన్‌లైన్ సర్వే చేయించారు. సరైన సిగ్నల్స్ అందక ఆదివాసీలు, గ్రామ వలంటీర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గుర్తించి స్థానిక ప్రజలకు సెల్ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని సర్పంచ్ కొర్ర రమేశ్ కోరారు.
Updated Date - 2023-06-26T01:15:51+05:30 IST