సెలూన్ షాపు నిర్వాహకుడు ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-08-15T01:12:48+05:30
మండలంలోని దేశపాత్రునిపాలెం సెలూన్ షాపు నిర్వహిస్తున్న యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.
పరవాడ, ఆగస్టు 14: మండలంలోని దేశపాత్రునిపాలెం సెలూన్ షాపు నిర్వహిస్తున్న యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఇతనితో భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాలిలావున్నాయి.
బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి పంచాయతీ బుదిరెడ్లపాలెం గ్రామానికి చెందిన బయ్యవరపు సత్తిబాబు(32) కొంత కాలం నుంచి దేశపాత్రునిపాలెంలో సెలూన్ షాపు నిర్వహిస్తూ కుటుంబంతోపాటు నివాసం వుంటున్నాడు. అయితే ఇతను మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల కిందట భార్య ఇందు, ఇద్దరు కుమారులు రోహిత్, హిమాన్ష్‌లను తీసుకొని వడ్లపూడిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సత్తిబాబు మద్యానికి మరింత బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సెలూన్ షాపు నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సురేశ్ సిబ్బందితో వచ్చి షట్టర్ తెరిపించి లోపలికి వెళ్లారు. అక్కడ మరో గది తలుపులకు లోపల గడియ వేసి వుంది. తలుపులు పగలగొట్టి చూడగా సత్తిబాబు ఉరి వేసుకుని కనిపించాడు. శరీరమంతా పూర్తిగా ఉబ్బి పోయింది. క్లూస్ టీం వివరాలు సేకరించింది. రెండు, మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
Updated Date - 2023-08-15T01:12:48+05:30 IST