సబ్బవరం
ABN, First Publish Date - 2023-02-18T01:24:38+05:30
రహదారుల పరంగా సబ్బవరం మండలానికి మహర్దశ పట్టింది.
మండలం మీదుగా రెండు జాతీయ రహదారులు
ఇప్పటికే ఎన్‌హెచ్-16...కొత్తగా ఎన్‌హెచ్-130 సీడీ
చివరి దశలో అనకాపల్లి-ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు పనులు
ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి
చురుగ్గా సాగుతున్న విశాఖ-రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం
2025 నాటికి పూర్తి అవుతుందని అంచనా
చిన్నయ్యపాలెం వద్ద రెండు హైవేలకు ఇంటర్ ఛేంజ్
సూరెడ్డిపాలెం నుంచి షీలానగర్‌కు కనెక్టవిటీ రోడ్డు
అవి పూర్తయితే విశాఖ నగరంలో తగ్గనున్న భారీ వాహనాల రద్దీ
సబ్బవరం, ఫిబ్రవరి 17:
రహదారుల పరంగా సబ్బవరం మండలానికి మహర్దశ పట్టింది. ఏకంగా రెండు జాతీయ రహదారులు ఈ మండలంలో నుంచి నిర్మాణం అవుతున్నాయి. అనకాపల్లి-ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు (ఎన్‌హెచ్-16) ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా, విశాఖ-రాయపూర్ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే (ఎన్‌హెచ్-130 సీడీ) మూడేళ్లలో పూర్తవుతుంది.
భారతమాల ప్రాజెక్టు ఫేజ్-1 కింద ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. డీపీఆర్, భూసేకరణ, టెండర్ ప్రక్రియలు 2021లో పూర్తయ్యాయి. ఏడీబీ నిధులు సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించే ఈ రోడ్డు పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం వున్న జాతీయ రహదారితో (590 కి.మీ.లు) సంబంధం లేకుండా కొత్తగా దీనిని నిర్మిస్తారు. ఎన్‌హెచ్-130 సీడీ నంబరు కేటాయించిన ఈ రహదారి మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. ఏపీలో 100 కి.మీ.లు, నాలుగు ప్యాకేజీలు; ఒడిశాలో 240 కి.మీ.లు, 11 ప్యాకేజీలు; ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ.లు, మూడు ప్యాకేజీలుగా ఉంది. ఏపీలో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకు నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఆలూరు-జక్కువ 1వ ప్యాకేజీ, జక్కువ-కొర్లాం 2వ ప్యాకేజీ, కొర్లాం-కంటకాపల్లి 3వ ప్యాకేజీ, కంటకాపల్లి-సబ్బవరం 4వ ప్యాకేజీగా విభజించారు. ప్రస్తుతం సబ్బవరం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు సుమారు 20 కి.మీ.ల రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిన్నయ్యపాలెం, మలునాయుడుపాలెం, గుల్లేపల్లి, ఎల్లుప్పి గ్రామాల మీదుగా వెళ్లే రహదారి సబ్బవరం మండలంలో ఆరు కిలోమీటర్లు ఉంది. గ్రావెల్, మట్టి పనులు దాదాపు పూర్తయ్యాయి. కల్వర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్తవలస మండలం గులివిందాడ గ్రామం వద్ద టోల్‌ప్లాజా నిర్మాణం జరుగుతున్నది. వాస్తవంగా వచ్చే ఏడాది చివరి నాటికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తికావాలి. అయితే కొన్నికారణాల వల్ల ఏడాది ఆలస్యంగా 2025 నాటికి పూర్తి అవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. విశాఖ-రాయపూర్ మధ్య ప్రస్తుత దూరం 590 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 13-15 గంటలు. కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్ హైవే పొడవు 464 కిలోమీటర్లు. ప్రయాణ సమయం ఏడు గంటలు (అధికారులు అంచనా). ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే విశాఖ-రాయపూర్ మధ్య దూరం 130 కిలోమీటర్లు, ప్రయాణ సమయం ఏడు గంటలు తగ్గుతుంది. కాగా మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ రహదారి అనకాపల్లి-ఆనందపురం మధ్య సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద ఎన్‌హెచ్-16ను కలుస్తుంది. ఇక్కడి నుంచి అమృతపురం, నరవ మీదుగా షీలానగర్ వరకు కొత్తగా ఆరు వరుసలతో జాతీయ రహదారి నిర్మిస్తారు.
సబ్బవరం మండలానికి మహర్దశ
ఒకప్పుడు స్టేట్ హైవే మాత్రమే వున్న సబ్బవరం మండలంలో ఇప్పుడు రెండు జాతీయ రహదార్లు ఏర్పాటవుతున్నాయి. అనకాపల్లి-ఆనందపురం మధ్య గతంలో వున్న ఆర్‌అండ్‌బీ రోడ్డును ఎన్‌హెచ్-16కి అనుసంధానం చేస్తూ ఆరు వరుసలుగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి బైపాస్ రోడ్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చింది. బైపాస్ రోడ్ల పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక విశాఖ-రాయ్‌పూర్ మధ్య కొత్తగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కూడా సబ్బవరం మండలం మీదుగానే వెళుతున్నది. సబ్బవరం (సూరెడ్డిపాలెం)-షీలానగర్ హైవే పనులు కూడా పూర్తయితే విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దీంతో విశాఖ నగరంలో పాత జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గతుంది.
Updated Date - 2023-02-18T01:24:39+05:30 IST