ఉక్కు కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో రూ.2,400 కోత!
ABN, First Publish Date - 2023-07-21T01:31:58+05:30
స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కోత పడింది.
సమస్య పరిష్కారానికి ఉక్కు యాజమాన్యం చర్యలు తీసుకోవాలి
కార్మిక సంఘాల నాయకుల విజ్ఞప్తి
ఉక్కుటౌన్‌షిప్, జూలై 20:
స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కోత పడింది. గత నెలకు సంబంధించిన జీతాలు ఈ నెల ఏడో తేదీ నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే తమ జీతాల్లో రూ.2,400 తగ్గడంతో అంతా గగ్గోలు పెడుతున్నారు. అసలే అంతంతమాత్రం జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తరుణంలో ఇంత మొత్తం కోత విధిస్తే తామెలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో 13,000 మందికి పైగానే కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2009 నుంచి ఐఆర్ (ఇంటీరియర్ రిలీఫ్) కింద రూ.300, ఎస్‌ఎంఏ (స్పెషల్ మిస్‌లేనియస్ అలవెన్స్) రూ.1000, ఏఎస్‌ఎంఏ (అడిషనల్ స్పెషల్ మిస్‌లేనియస్ అలవెన్స్) రూ.1,100 కలిపి మొత్తం 2,400ను ప్రతినెలా జీతంతో పాటు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. అయితే ఈఎస్‌ఐ మేనేజ్‌మెంట్ ఈ విధంగా కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్న రూ.2400కు 2009 నుంచి ఈఎస్‌ఐ కట్టాలని కాంట్రాక్టర్లకు గతంలో నోటీసులు జారీచేసింది దీనిపై అప్పట్లో కాంట్రాక్టర్ల అసోసియేషన్, కార్మిక సంఘాల నాయకులు, ఉక్కు యాజమాన్యం వారు రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో కాంట్రాక్టు కార్మికులకు చెల్లించే రూ.2,400కు ఎటువంటి ట్యాక్స్ కానీ పీఎఫ్, ఈఎస్‌ఐ గానీ కట్టనవసరం లేదని ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. అయితే మళ్లీ ఆ మొత్తానికి కూడా 2009 నుంచి ఈఎస్‌ఐ కట్టాలని గత నెల నోటీసులు రావడంతో ఇకపై కాంట్రాక్టు కార్మికులకు ఆ రూ.2,400 చెల్లించలేమని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఉక్కు యాజమాన్యం కల్పించుకుని కార్మికులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.2,400 తక్కువగా జీతాలు చెల్లించడం తమకూ ఇబ్బందిగానే వుందని, అందువల్ల ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉక్కు యాజమాన్యానికి విన్నవించామని కాంట్రాక్టర్లు చెబు తున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు ఈఎస్‌ఐ కట్టాలంటే చాలా ఇబ్బందికరమని వారంటున్నారు.
ఉక్కు యాజమాన్యం కల్పించుకోవాలి
-మంత్రి రవి, ఏఐటీయూసీ కాంట్రాక్టు సంఘం ప్రధాన కార్యదర్శి
కాంట్రాక్టు కార్మికుల జీతాల్లో రూ.2400 కోత విధించడం తగదు. దీంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కు యాజమాన్యం జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలి. లేనిపక్షంలో ఉద్యమం చేస్తాం.
Updated Date - 2023-07-21T01:31:58+05:30 IST