బస్సు వెలికితీతకు వర్షం ఆటంకం
ABN, First Publish Date - 2023-08-22T00:07:50+05:30
స్థానిక ఘాట్‌లో ప్రమాదానికి గురైన పీటీడీ బస్సు వెలికితీతకు వర్షం అడ్డంకిగా మారింది. లోయలోని చెట్ల కొమ్మలకు చిక్కుకుని ఉన్న బస్సును పూర్తిగా బయటకు వెలికి తీయాలని ఆర్టీసీ, రోడ్లు, భవనాల శాఖాధికారులు సోమవారం నిర్ణయించారు.
- లోయలోంచి బస్సును తీసేందుకు చర్యలు మొదలు
- నేడు బస్సును పూర్తిగా వెలికితీసే అవకాశం
పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక ఘాట్‌లో ప్రమాదానికి గురైన పీటీడీ బస్సు వెలికితీతకు వర్షం అడ్డంకిగా మారింది. లోయలోని చెట్ల కొమ్మలకు చిక్కుకుని ఉన్న బస్సును పూర్తిగా బయటకు వెలికి తీయాలని ఆర్టీసీ, రోడ్లు, భవనాల శాఖాధికారులు సోమవారం నిర్ణయించారు. అందుకు గానూ రెండు క్రేన్‌లను, అనకాపల్లి, గోవాడ ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను, విజయనగరం నుంచి పలు పరికరాలను రప్పించారు. వాటి సహాయంలో లోయ మధ్యలో ఉన్న బస్సును బయటకు తీయడానికి సోమవారం రోజంతా ప్రయత్నాలు చేశారు. అయితే ఉదయం నుంచి ఘాట్‌లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో బస్సు వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో సోమవారం బస్సు వెలికి తీసే పనులు పూర్తి కాలేదు. మంగళవారం వాతావరణం అనుకూలిస్తే బస్సును బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పీటీడీ డిపో మేనేజర్ శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ సిబ్బంది, ప్రత్యేక బృందాలు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T00:07:50+05:30 IST