పక్కా కమర్షియల్!
ABN, First Publish Date - 2023-01-18T00:59:31+05:30
విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ (ఎస్‌జీఎస్‌టీ) అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వాణిజ్య పన్నుల శాఖలో అనధికార దందా
అధికారులపై ఫిర్యాదుల వెల్లువ
కొందరు సిండికేట్‌గా ఏర్పడి
దోచుకుంటున్నారని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఎవరెవరి నుంచి ఎంత వసూలు చేశారో పేర్కొంటూ లేఖలు
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పరిధిలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో చార్జిమెమోలు జారీ
పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఎస్‌జీఎస్‌టీ సెక్రటరీ గుల్జార్ ఆదేశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ (ఎస్‌జీఎస్‌టీ) అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేని వ్యాపార సంఘాలు ప్రభుత్వానికి ఇక్కడి పరిస్థితిని తెలియజేశాయి. కొందరు అధికారులు సిండికేట్‌గా ఏర్పడి గత నాలుగేళ్లుగా దోచుకుంటున్నారని, ఏదో ఒక పేరు చెప్పి నిత్యం బెదిరిస్తున్నారని, వారి నుంచి కాపాడాలని వేడుకున్నాయి. ఇంకొంతమంది కూడా ఇక్కడి అధికారుల పేర్లు, వారు వసూలుచేసిన మొత్తాలు, చేపట్టిన ఆడిట్లు తదితరాలతో సవివరంగా ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి కొంతమంది మీదే ఆరోపణలు రావడం, వారు బాధ్యత వహిస్తున్న సర్కిళ్లలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో ఇద్దరు అధికారులకు చార్జిమెమోలు ఇచ్చారు. పది రోజుల్లో ఆరోపించిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్‌జీఎస్‌టీ సెక్రటరీ గుల్జార్ నుంచే నేరుగా శ్రీముఖాలు పంపించారు. దాంతో ఇక్కడి అధికార వర్గాలు కింద మీద పడుతున్నాయి.
రవాణా సంస్థలతో కుమ్మక్ము
విశాఖపట్నం డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఏఈఓగా వ్యవహరిస్తున్న జె.ధర్మపాల్ పార్శిల్ రవాణా సంస్థలతో కుమ్మక్కై, ఇతర ప్రాంతాల నుంచి రశీదులు లేకుండా దిగుమతి చేసుకుంటున్న సరకులను పట్టుకొని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఓ న్యాయవాది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ దందా నాలుగేళ్లుగా సాగుతోందని, సదరు అధికారి ఇప్పటివరకు 50 కేసులను సెటిల్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నంతో పాటు అనకాపల్లి జిల్లాలో డీలర్లను బెదిరించడం, నకిలీ ఆడిట్ ఆథంటికేషన్ లేఖలు చూపించి అకౌంట్స్ తనిఖీలు చేస్తామని చెప్పడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం రెడీమేడ్ వస్త్ర వ్యాపారుల నుంచి రూ.40 లక్షలు, హార్డ్‌వేర్ అండ్ పెయింట్స్ వ్యాపారుల నుంచి రూ.30 లక్షలు, బంగారం, వెండి వ్యాపారుల నుంచి రూ.90 లక్షలు, హోటళ్లు, స్వీట్ షాపుల నుంచి రూ.25 లక్షలు, జీడి పప్పు వ్యాపారుల నుంచి రూ.20 లక్షలు, జోళ్ల వ్యాపారుల నుంచి రూ.15 లక్షలు, ఫర్నీచర్ వ్యాపారుల నుంచి రూ.20 లక్షలు, ఆటోమొబైల్స్ నుంచి రూ.25 లక్షలు, ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారుల నుంచి రూ.50 లక్షలు, అనకాపల్లి వ్యాపారుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదు అందిందని, వాటిపై వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు చార్జిమెమోలో కోరారు. ధర్మపాల్ నుంచి మూడు అంశాలపై వివరణ కోరారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.
భవనం నిర్మిస్తున్నామని చెప్పి
విశాఖపట్నం డివిజన్ కార్యాలయంలో జీఎస్‌టీఓగా వ్యవహరిస్తున్న పి.ప్రశాంత్‌కుమార్‌కు కూడా చార్జి మెమో ఇచ్చారు. ఈయన పోస్టింగ్ అనకాపల్లి కాగా అనధికారికంగా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ అనధికార వసూళ్ల కోసం ఏర్పాటుచేసిన బృందంలో ప్రశాంత్ కుమార్ ఒక సభ్యుడని, జీఎస్‌టీ కార్యాలయానికి కొత్త భవనం నిర్మిస్తున్నామని చెప్పి వ్యాపార వర్గాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆయనపై ఫిర్యాదులు అందాయి. డీలర్లపై ఎటువంటి తనిఖీలు ఉండవని, ఆడిట్లు కూడా చేయబోమని చెప్పి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఆరోపించారు. ఈయన బిల్డర్స్ అసోసియేషన్ నుంచి రూ.60 లక్షలు, ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారుల నుంచి రూ.15 లక్షలు, రైల్వే కాంట్రాక్టర్ల నుంచి రూ.15 లక్షలు, అల్యూమినియం, ఇత్తడి, తుక్కు వ్యాపారుల నుంచి (రెండు జిల్లాలు) రూ.25 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, వివరణ ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారి గుల్జార్ చార్జిమెమో ఇచ్చారు. మొత్తం ఐదు అంశాలపై వివరణ కోరారు. లంచాల కోసం బృందాన్ని ఏర్పాటుచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కమిషనర్ జయశంకర్ కూడా సస్పెన్షన్‌లో వుండడం విశేషం.
Updated Date - 2023-01-18T00:59:32+05:30 IST