నేరేడుబందను సందర్శించిన ఐటీడీఏ పీవో
ABN, First Publish Date - 2023-02-03T00:47:01+05:30
మండలంలోని కొండలపై ఉన్న నేరేడుబంద గిరిజన గ్రామాన్ని గురువారం పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సందర్శించారు.
రావికమతం, ఫిబ్రవరి 2: మండలంలోని కొండలపై ఉన్న నేరేడుబంద గిరిజన గ్రామాన్ని గురువారం పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సందర్శించారు. గ్రామంలో సమస్యలపై ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి ఆయన నేరేడుబందను సందర్శించి, గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఆదివాసీల సమస్యలను పీవో గోపాలకృష్ణ తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామం నుంచి బడికి వెళ్లేందుకు రోజూ తమ పిల్లలు అడవి మార్గంలో ఐదు కిలోమీటర్ల నడిచి వెళుతున్నారని, స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేవరకు ఆందోళనగా ఉంటున్నామని గిరిజనులు తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల భవనానికి అవసరమైన గోడలను ఇప్పటికే తాము నిర్మించామని చెప్పగా.. పీవో గోడలను పరిశీలించారు. ఆ గోడలపై రేకు వేసేందుకు రూ. లక్ష మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పాఠశాల ఏర్పాటుకు పీవో హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని వారికి ఇస్తామన్నారు. గ్రామం నుంచి తిరిగి వస్తున్న పీవోకు మార్గమధ్యంలో జడ్.జోగుంపేట స్కూల్ నుంచి నడిచి వస్తున్న విద్యార్థులు కనిపించడంతో మీకు జగనన్న స్కూల్ బ్యాంగులు,బూటులు ఇవ్వలేదా అని అడిగారు. అటువంటివి ఏవీ ఇవ్వలేదని పిల్లలు చెప్పడంతో పీవో గోపాలకృష్ణ అవాక్కయ్యారు. దీంతో అక్కడ నుంచే ఎంఈవోకు ఫోన్‌లో మాట్లాడారు. పిల్లలకు బ్యాగులు, బూట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నేరేడుబంద గ్రామ పిల్లలకు ఇవ్వాలని ఆదేశించారు. అక్కడ నుంచి పీవో గోపాలకృష్ణ అజయ్‌పురం గిరిజన గ్రామానికి వెళ్లారు. అక్కడ మహిళలు మాట్లాడుతూ.. తాము పొందిన డ్వాక్రా రుణాన్ని తిరిగి ప్రతీ నెలా వెలుగు సిబ్బందికి ఇచ్చామని, వారు బ్యాంకుకు చెల్లించలేదని మహిళలు పీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెలుగు సిబ్బందిని అడుగుతున్నా పట్టించుకోలేదని గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని చూడాలని ఎంపీడీవో వెంకన్నబాబును పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. పీవో వెంట తహసీల్దార్ మహేశ్వరరావు, చీమలపాడు సర్పంచ్ వంజరి గంగరాజు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-02-03T00:47:03+05:30 IST