ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజారోగ్యానికి పొగ

ABN, First Publish Date - 2023-09-27T01:16:13+05:30

నగరంలోని కాపులుప్పాడలో గల డంపింగ్‌ యార్డు నిర్వహణపై కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

డంపింగ్‌యార్డు నిర్వహణపై మహా నిర్లక్ష్యం

కాపులుప్పాడలో పేరుకుపోయిన లక్షలాది టన్నుల చెత్త

శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగంపై మొక్కుబడి చర్యలు

భూగర్భ జలాలు కలుషితం, వాయు కాలుష్యం కూడా...

జీవీఎంసీ తీరును తూర్పారబట్టిన కాగ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని కాపులుప్పాడలో గల డంపింగ్‌ యార్డు నిర్వహణపై కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. యార్డు నిర్వహణలో జీవీఎంసీ నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టింది. చెత్త కుప్పలను ఏళ్ల తరబడి వదిలేయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని పేర్కొంది. అదేవిధంగా చెత్తను దహనం చేస్తుండడంతో విష వాయువులు వెలువడుతున్నట్టు వెల్లడించింది.

జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజూ సుమారు 1,200 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను ఇంటి వద్దనే తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తగా విభజించి చెత్త వాహనాలకు అందజేసేలా జీవీఎంసీ చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం మూడు రంగుల చెత్త బుట్టలను ప్రతి ఇంటికీ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో నిధులు కేటాయించింది. ఆ నిధులతో జీవీఎంసీ అధికారులు చెత్త బుట్టలు కొనుగోలు చేశారు. అయితే పంపిణీపై అధికారులు సరిగా దృష్టిసారించకపోవడంతో చాలా ఇళ్లకు అందలేదు. దీంతో చెత్త బుట్టలు అందనివారు తమ ఇంట్లోని తడి, పొడి చెత్తతోపాటు ఎలక్ర్టానిక్‌ వ్యర్థాల (ప్రమాదకరమైన వ్యర్థాలు)ను ఒకే సంచిలో వేసి చెత్త వాహనాలకు అందజేస్తున్నారు. వాటిని అలాగే చెత్త వాహనాల సిబ్బంది యార్డుకు తీసుకువెళ్లి పడేస్తున్నారు. అంటే తడి, పొడి చెత్త విభజన సక్రమంగా జరగడం లేదు. ఇది చెత్త పునర్వినియోగానికి ప్రధాన అవరోధంగా మారుతోంది. అదే తడి చెత్త వేరుగా ఉంటే యార్డులోనే సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు అవకాశం ఉండేది. పొడి చెత్త అయితే పలురకాల వస్తువులు తయారుచేసేందుకు అవకాశం కలిగేది. అది జరగకపోవడంతో కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో చెత్త కుప్పలు ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయి. వంద ఎకరాల విస్తీర్ణంలో వున్న కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డులో పది అడుగులకుపైగా ఎత్తున దాదాపు 20 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. చెత్తకుప్పలు కొండలా పేరుకుపోవడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఆ ప్రభావం యార్డు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిపై పడుతోంది. అదేవిధంగా చెత్తను శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగించకుండా దహనం చేస్తున్నారు. చెత్తను మండించడం వల్ల మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే డయాక్సిన్‌, ఫ్రియాన్స్‌ వంటి విషవాయువులు ఉత్పత్తి అయి గాలిలో కలుస్తున్నాయి. కలుషితమైన ఆ గాలిని పీల్చడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని కాగ్‌ తన నివేదికలో ప్రస్తావించింది. వ్యర్థాల నిర్వహణలో జీవీఎంసీ తీరు అధ్వానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాపులుప్పాడ యార్డుపై జీవీఎంసీ దృష్టిసారించాలని సూచించింది.

Updated Date - 2023-09-27T01:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising