కొత్తగా బైక్ అంబులెన్సులంట!
ABN, First Publish Date - 2023-01-29T03:09:14+05:30
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్తగా బైక్ అంబులెన్సులను ప్రవేశపెట్టబోతున్నామని జగన్ సర్కారు గొప్పలు చెబుతోంది.
ప్రపంచంలోనే మొదటిసారి అంటూ సర్కారు గొప్పలు
ఆరేళ్ల కిందటే ప్రవేశపెట్టిన నాటి చంద్రబాబు ప్రభుత్వం
అప్పుడు తెచ్చిన వాటిలోనే ఎన్నో ప్రయోజనాలు
కొత్తగా తెచ్చేవాటిలో రోగికి భద్రత తక్కువంటున్న వైద్యులు
ఫీడర్ అంబులెన్సులనే కొనసాగించాలని డిమాండ్
(విశాఖపట్నం/పాడేరు-ఆంధ్రజ్యోతి)
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్తగా బైక్ అంబులెన్సులను ప్రవేశపెట్టబోతున్నామని జగన్ సర్కారు గొప్పలు చెబుతోంది. ఏజెన్సీలో సరైన రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేందుకు వీటిని తీసుకురానున్నామని అంటోంది. అయితే, ఆరేళ్ల కిందటే నాటి చంద్రబాబు ప్రభుత్వం ఫీడర్ అంబులెన్సుల పేరిట వీటిని తీసుకొచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకొస్తామంటున్న బైక్ అంబులెన్సుల కంటే ఫీడర్ అంబులెన్సుల్లోనే రోగికి అధిక భద్రత, సౌకర్యం ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. రోగులకు బైక్ అంబులెన్సుల కంటే ఫీడర్ అంబులెన్స్‌లే ఉపయోగకరమని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫీడర్ అంబులెన్స్ కూడా ద్విచక్ర వాహనమేనని, కాకపోతే రోగి కూర్చునేందుకు, పడుకునేందుకు వీలుగా పక్కన చిన్న అటాచ్‌మెంట్ ఉంటుందని, అది భద్రతాపరంగా మంచిదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇస్తామంటున్న టూ వీలర్ అంబులెన్స్‌లో రోగిని బైక్ సీటుపై వెనుక ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టాల్సి ఉంటుందని, ఎక్కడైనా కుదుపులు వస్తే, రోగి కింద పడిపోయే ప్రమాదం ఉందని, సీటు బెల్ట్ ఉన్నా, అది ఆపలేదని వైద్యులు అంటున్నారు. మన్యంలో రోడ్డు సదుపాయం లేని అనేక గిరిజన పల్లెలకు 108 వాహనాలు వెళ్లలేని పరిస్థితి. దీంతో మారుమూల ప్రాంతాల గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు అందేవి కావు.
ముఖ్యంగా గర్భిణులకూ 108 సేవలు అందని దుస్థితి. ఈ సమస్యను అధిగమించాలని భావించిన గత తెలుగుదేశం ప్రభుత్వం ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు సైతం 108 అత్యవసర సేవలు అందించాలని భావించింది. ఏజెన్సీలో 108 వాహనం వెళ్లలేని ప్రాంతాలకు సైతం అంబులెన్స్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో 2018 ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఫీడర్ అంబులెన్సు సేవలను నాటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల రోగులు 108కు కాల్ చేస్తే...ఆ ప్రాంతానికి ఫీడర్ అంబులెన్స్ చేరుకొని రోగిని సమీప ఆస్పత్రికి లేదా, సాధారణ 108 వాహనం వద్దకు తీసుకెళ్తోంది. 108లో ఉన్న సిబ్బందే ఫీడర్ అంబులెన్సులో పైలట్‌గా విధులు నిర్వహిస్తుండడంతో రోగికి అవసరమైన తక్షణ వైద్య సేవలను సైతం అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏల పరిధిలో నెలకు 10,500 మందికి ఫీడర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. రోగికి ఎండ తగలకుండా, వర్షం పడితే తడవకుండా పైన కప్పు కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేవాటికి ఆ సదుపాయాలు ఏమీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో అందించిన ఫీడర్ అంబులెన్స్‌లే ఉపయోగకరమని, వాటినే కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Updated Date - 2023-01-29T03:09:15+05:30 IST