మట్టి దందా!
ABN, First Publish Date - 2023-06-06T01:31:13+05:30
జిల్లాలోని పలు మండలాల్లోని సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు జలవనరుల శాఖకు చెందిన చెరువుల్లో నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. లోతట్టు పంట భూములను ఎత్తు చేయడానికి అంటూ ఇరిగేషన్ అధికారుల నుంచి మొక్కుబడిగా అనుమతులు తీసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి మట్టి తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అధికారులకు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సాగునీటి చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు
అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యం
లోతట్టు పంట భూములు మెరక చేయడానికి మట్టి కోసం రైతుల పేర్లతో దరఖాస్తు
ఇరిగేషన్ అధికారులు వెంటనే అనుమతులు ఇచ్చేలా ఒత్తిళ్లు
ఎక్స్‌కవేటర్లతో చెరువుల్లో ఇష్టారాజ్యం మట్టి తవ్వకాలు
రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖాళీ స్థలాల ఎత్తుకు, ఇటుక బట్టీలకు తరలింపు
భారీగా సొమ్ము చేసుకుంటున్న స్థానిక నాయకులు
చోద్యం చూస్తున్న నియంత్రణ శాఖల అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పలు మండలాల్లోని సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు జలవనరుల శాఖకు చెందిన చెరువుల్లో నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. లోతట్టు పంట భూములను ఎత్తు చేయడానికి అంటూ ఇరిగేషన్ అధికారుల నుంచి మొక్కుబడిగా అనుమతులు తీసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి మట్టి తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అధికారులకు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైన తరువాత రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనున్న మండలాల్లో ఇటువంటివి అధికంగా కనిపిస్తున్నాయి. లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి గ్రావెల్, మట్టి పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. అనకాపల్లి, కశింకోట, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వుంది. కొండవాలు ప్రాంతాలు, పోరంబోకు భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే రెవెన్యూ, మైనింగ్, స్థానిక పంచాయతీ అధికారుల నుంచి అనుమతులు తీసుకువాలి. సీనరేజ్ కింద నిర్ణీత మొత్తాన్ని మైనింగ్ శాఖకు చెల్లించారు. దీంతో అక్రమార్కుల కన్ను సాగునీటి చెరువులపై పడింది. లోతట్టుగా వున్న పంట పొలాలను ఎత్తు చేయడానికి చెరువుల్లో నుంచి మట్టి తవ్వుకుంటామని, అనుమతులు ఇవ్వాలని రైతుల పేర్లతో ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేస్తున్నారు. తరువాత కథంతా వారే నడిపిస్తూ శరవేగంగా అనుమతులు తెచ్చుకుంటున్నారు. వాస్తవంగా సాగునీటి చెరువుల్లో మట్టి తవ్వాలంటే జలవనరుల శాఖతోపాటు రెవెన్యూ, మైనింగ్, స్థానిక పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. చెరువుల్లో నుంచి తీసుకెళ్లే మట్టిని కేవలం పంట పొలాలకు మాత్రమే వినియోగించాలి. కానీ అక్రమార్కులు ఎక్స్‌కవేటర్లతో చెరువుల్లో మట్టి తవ్వి, చట్టుపక్కల గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇటుకల బట్టీలకు, ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడు అయితే రూ.1,000 నుంచి రూ.3 వేలు, టిప్పర్ లారీ అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఎవరైనా అడ్డుకుంటే.. సొంత పార్టీకి చెందిన మండల, నియోజకవర్గస్థాయి నేతలకు ఫోన్లు చేసి, చర్యలు తీసుకోకుండా చూసేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయడానికి అధికారులు సాహసించడంలేదని తెలిసింది. కొన్ని మండలాల్లో మట్టి, గ్రావెల్ అక్రమార్కుల నుంచి అధికారులు ముడుపులు తీసుకొని పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏ మండలంలో.. ఎక్కడ...
అనకాపల్లి మండలం ఊడేరు పంచాయతీ దిబ్బపాలెం సర్వే నంబర్ 70లో జలవనరుల శాఖకు చెందిన 12.1 ఎకరాల చెరువు వుంది. దీనిలో అధికార పార్టీకి చెందిన ఒక స్థానిక నాయకుడు ఎక్స్‌కవేటర్‌తో రాత్రిపూట మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్లతో సమీపంలోని ఊడేరు, అల్లికాలుడుపాలెం, ముద్దుర్తి ప్రాంతాల్లో వున్న ఇటుకల బట్టీలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన రహదారి నుంచి చెరువు వరకు వాహనాలు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేశారు. ఊడేరులో కొండపోరంబోకు భూమిలో గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై గనుల శాఖాధికారి సుబ్బారాయుడును వివరణ కోరగా, ఊడేరులో గ్రావెల్, దిబ్బపాలెంలో చెరువులో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఒకవేళ జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులు అనుమతులు ఇచ్చినా... తమనుంచి ఎటువంటి అనుమతులు పొందలేదని స్పష్టం చేశారు.
సబ్బవరంలో..
సబ్బవరం, జూన్ 5: సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పత్రికల్లో పలు మార్లు కఽథనాలు వచ్చి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు యంత్రాలు సీజ్ చేస్తున్నా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలను ఆపడం లేదు. ఒక పక్క ఉన్నతాధికారులు, మరో పక్క అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకోలేకపోతున్నామని స్థానిక అధికారులు వాపోతున్నారు మలునాయుడుపాలెంలో కామరాజు చెరువు, మావూళ్లు చెరువు, ఎ.సిరసపల్లిలో పిల్లిఎర్రయ్య బంద, అసకపల్లిలో సంగడాల చెరువు, ఆరిపాకలో వెంకటరావు చెరువు, కొత్తచెరువు, బాటజంగాలపాలెంలో చిక్కాలవాని చెరువు, అంతకాపల్లిలో గొర్లివానిచెరువు, ఇరువాడలో బోయినవాని చెరువులో మట్టి తవ్వకాలపై ‘అంధ్రజ్యోతి’లో పలు కథనాలు వచ్చాయి. గత వారం ఇరువాడ బోయినవాని చెరువు, బాటజంగాలపాలెం చిక్కాలవానిచెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్న ఎక్సకవేటర్‌ను మైనింగ్ అధికారులు సీజ్ చేసి అపరాధ రుసుం వసూలు చేశారు. అయినప్పటికీ చెరువుల్లో మట్టి తవ్వకాలు సాగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఆవ చెరువులో మట్టి దోపిడీ
నక్కపల్లి, జూన్ 5: నక్కపల్లి, పాయకరావుపేట మండలాల సరిహద్దులోని దేవవరం ఆవ చెరువులో అనుమతుల పేరిట అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. పాయకరావుపేట పట్టణానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసుకుని, పట్టపగలే చెరువులో మట్టిని తవ్వి టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్న ఇతను సీతారాంపురం, పీఎల్‌పురం, నామవరం, దేవవరం ప్రాంతాల్లో వున్న తన రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే అధికారులుగానీ, స్థానికులుగానీ అడ్డుకోకుండా వుండడానికి పీఎల్ పురం గ్రామానికి చెందిన ఒక రైతు.. లోతట్టుగా తన పంట భూములను ఎత్తు చేయడానికి గుంటుపల్లి పంచాయతీ పరిధిలోని ఆవ చెరువులో నుంచి 15 వేల క్యూబిక్కుల మట్టిని తవ్వుకోవడానికి ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్టు కలరింగ్ ఇస్తున్నార కాంగ్రెస్ నాయకుడు భూర్తి ఏసుబాబు ఆరోపిస్తున్నారు.
ఎస్.రాయవరం మండలంలో...
ఎస్. రాయవరం, జూన్ 5: మండలంలోని పేటసూదిపురం, బెన్నవరం, కొరుప్రోలు, తదితర గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పేటసూదిపురం పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడంపై ఏప్రిల్ 9వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించడంతో ఇరిగేషన్ ఏఈ చిన్నారావు స్పందించారు. చెరువులో కొలతలు వేసి 400 క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వి తరలించినట్టు నిర్ధారించారు. నిందిలను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఎస్.రాయవరానికి చెందిన బెన్నవరం రామసాగరం చెరువులో రాత్రి పూట మట్టి తవ్వకాలు జరుపుతున్న వైనంపై ఏప్రిల్ 25వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. ఈసారి కూడా ఏఈ స్పందించి 285 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తరలించినట్టు నిర్ధారించారు. ఇక్కడ కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అలాగే మే 22న కొరుప్రోలు గ్రామానికి చెందిన చెరువులో అక్రమంగా తవ్వకాలు జరిగినట్టు వార్త ప్రచురితమైనప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. వాస్తవంగా చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్‌తోపాటు రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ అధికారులు కూడా స్పందించి చర్యలు చేపట్టాలి. కానీ ఈ శాఖల అధికారులు ఆయాచెరువుల వైపు కన్నెత్తి అయినా చూడలేదు.
Updated Date - 2023-06-06T01:31:13+05:30 IST