కిలేడీ!
ABN, First Publish Date - 2023-05-02T01:41:33+05:30
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన ఉద్రాక్ష హరివిజయ్(34) హత్యలో అతని భార్య ప్రీతి ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
భర్త హత్యకు స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్... అంతా ఆమే!
చోడవరంలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
ప్రియుడు, స్నేహితుడితో కలిసి భర్తను హతమార్చాలని ప్లాన్
రూ.50 వేలకు బేరం
కుమార్తె కుట్రకు సహకరించిన తండ్రి
గుండెపోటుగా చిత్రీకరించే యత్నం
పోలీసులకు ఫిర్యాదు చేసిన పాడేరు వైద్యులు, మృతుడి కుటుంబీకులు
లోతుగా దర్యాప్తు చేసిన చోడవరం పోలీసులు
ఏడుగురు నిందితులు అరెస్టు... రిమాండ్‌కు తరలింపు
చోడవరం, మే 1:
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన ఉద్రాక్ష హరివిజయ్(34) హత్యలో అతని భార్య ప్రీతి ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రీతితోపాటు, ఆమె తండ్రి శంకరరావు, ప్రీతి ప్రియుడైన చోడవరం పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన బి.సాయిప్రణయ్, ప్రీతి స్నేహితుడైన అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామానికి చెందిన లావేటి లలిన్ కుమార్, ఇతని స్నేహితులు అచ్యుతాపురానికి చెందిన కర్రి రాము, పిట్టకొండ రాజు అలియాస్ బషీర్, అనకాపల్లికి చెందిన సాయిలను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి సీఐ బి.శ్రీనివాసరావు సోమవారం మీడియాకు వెల్లడించిన వివరాలు...
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నేరోడివలసకు చెందిన హరివిజయ్(34), తన భార్య ప్రీతితో కలిసి చోడవరంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరి ఇంటికి సమీపంలో వుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సాయిప్రణయ్‌తో ప్రీతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్‌లను చూసిన హరివిజయ్.. భార్య ప్రీతిని గట్టిగా నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను హతమార్చి, ప్రియుడు సాయిప్రణయ్‌తో కలిసి ఉండాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఒక పథకాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని తన తండ్రి శంకరరావు దృష్టికి కూడా తీసుకెళ్లింది. అంతేకాక గాజువాకలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు, అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన లలిన్ కుమార్‌ను కూడా సంప్రదించింది. భర్త తనను వేధిస్తున్నాడని, అతనిని హతమార్చేందుకు సహకారం కావాలని కోరింది. ప్రీతి అభ్యర్థనతో లలిన్ కుమార్ తన స్నేహితులైన అచ్యుతాపురానికి చెందిన కర్రి రాము, పిట్లకొండ రాజేశ్, అనకాపల్లికి చెందిన సాయిలకు ఈ విషయం చెప్పి చోడవరం వెళ్లాలని సూచించాడు. ఏప్రిల్ 17వ తేదీన లలిన్ కుమార్ మినహా మిగిలిన వారంతా చోడవరం వెళ్లారు. తమ ఇంటికి ఏ విధంగా చేరుకోవాలో ప్రీతి వాట్సాప్ లొకేషన్ పెట్టడంతో కొద్దిసేపట్లోనే అందరూ అక్కడికి చేరుకున్నారు. వీరంతా తన స్నేహితులంటూ భర్తకు పరిచయం చేసి ఇంట్లోనే విందు ఏర్పాటు చేసింది. దీనికి మూడు రోజుల క్రితమే ప్రీతి తండ్రి శంకరరావు కూతురు ఇంటికి వచ్చాడు. భోజనాలు చేసిన తరువాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రీతి.. ఆమె తండ్రి శంకరరావు, ప్రియుడు ప్రణయ్‌తోపాటు అచ్యుతాపురం, అనకాపల్లి నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కలిసి దుప్పటి, తలగడతో హరివిజయ్‌కు ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం అచ్యుతాపురం, అనకాపల్లి నుంచి వచ్చిన వారికి ప్రీతి రూ.50 వేలు ఇచ్చి పంపించేసింది. తరువాత హరివిజయ్ మృతదేహాన్ని తండ్రి సాయంతో కారు డిక్కీలోకి చేర్చి, తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తన భర్తకు గుండెపోటు వచ్చిందని వైద్యులకు చెప్పింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. కానీ హరివిజయ్ మృతిపై వైద్యులు, యువకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పాడేరు పోలీసులు విచారణ చేపట్టారు. హరివిజయ్‌ది హత్యగా నిర్ధారణ కావడం, అనంతరం పాడేరు నుంచి ఈ కేసును చోడవరం పోలీస్ స్టేషన్‌కు బదలాయించిన సంగతి తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించడంతో మొత్తం ఏడుగురు నిందితులను (ప్రీతి, శంకరరావు, సాయిప్రణయ్, లలిన్ కుమార్, కర్రి రాము, పిట్టకొండ రాజు, సాయి) ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రీతిని ప్రధాన నిందితురాలిగా చేర్చారు. సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. ఇదిలావుండగా భర్తను హతమార్చడానికి ముందే అతని పేరిట ఉన్న ఆస్తులను ప్రీతి తన పేరిట మార్పించుకున్నట్టు హరివిజయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2023-05-02T01:41:33+05:30 IST