జగనన్న నీళ్ల కాలనీ
ABN, First Publish Date - 2023-05-04T01:34:42+05:30
విశాఖ నగరానికి చెందిన పేదల కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో వేసిన జగనన్న లేఅవుట్ జలమయమైంది. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చుట్టుపక్కల గల కొండల పైనుంచి వచ్చిన నీరు లేఅవుట్‌ను ముంచెత్తింది. భారీవర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. లేఅవుట్ వేశాం...అక్కడితో తమ పని అయిపోయిందన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
పైడివాడఅగ్రహారంలో లేఅవుట్‌ను ముంచెత్తిన వరద
చుట్టుపక్కల గల కొండల పైనుంచి వచ్చే నీరు
ప్రవహించే గెడ్డలను పూడ్చివేయడమే కారణం
భారీవర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థతి
చలనం లేని అధికారులు
సబ్బవరం, మే 3:
విశాఖ నగరానికి చెందిన పేదల కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో వేసిన జగనన్న లేఅవుట్ జలమయమైంది. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చుట్టుపక్కల గల కొండల పైనుంచి వచ్చిన నీరు లేఅవుట్‌ను ముంచెత్తింది. భారీవర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. లేఅవుట్ వేశాం...అక్కడితో తమ పని అయిపోయిందన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో సబ్బవరం మండలం పైడివాడ, పైడివాడఅగ్రహారం, ఎరుకునాయుడుపాలెంతో పాటు మరో ఐదు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి సుమారు 1000 ఎకరాల వరకూ అధికారులు సమీకరించారు. ఇందులో డి.పట్టా, ఆక్రమిత భూములు ఉన్నాయి. పైడివాడ, పైడివాడఅగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో సమీకరించిన 320 ఎకరాల్లో రూపొందించిన లేఅవుట్‌లో ఇళ్ల స్థలాలను గత ఏడాది ఏప్రిల్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎవరూ ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఆ బాధ్యతను ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అయితే ముఖ్యమంత్రి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదైనా...ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. ఇదిలావుండగా పైడివాడఅగ్రహారంలో జగనన్న కాలనీకి ఆనుకుని కొండలు ఉన్నాయి. వర్షం కురిస్తే వాటి పైనుంచి వరద నేరుగా లేఅవుట్ మీదుగా ప్రవహిస్తోంది. గతంలో వరద తీవ్రతకు లేఅవుట్ కోతకు గురైంది. పునాదుల కింద వున్న మట్టి కూడా కొట్టుకుపోయింది. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద ఇచ్చిన రీ కనస్ట్రక్షన్ ప్లాట్లు కూడా కోతకు గురయ్యాయి. అయినా వరదను మళ్లించేందుకు అధికారులు కాలువలు నిర్మించడం లేదు. బుధవారం కురిసిన వర్షానికి గత ఏడాది వర్షాకాలంలో మాదిరిగానే వరదనీరు మరోసారి జగనన్న లేఅవుట్ పై నుంచి ప్రవహించింది.
గెడ్డలు పూడ్చివేయడంతో దుస్థితి
పైడివాడ, పైడివాడఅగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో మూడు కొండలు ఉన్నాయి. ఈ కొండల పైనుంచి వచ్చే నీరు పూర్వం గెడ్డలు, వాగుల ద్వారా గొల్లలపాలెం రాయపురాజు చెరువులోకి వెళ్లేది. అయితే అదే ప్రాంతంలో జగనన్న లేఅవుట్ కోసం సుమారు 320 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. కానీ ఆ గెడ్డలను వీఎంఆర్డీఏ అధికారులు లేఅవుట్‌లో చూపించలేదు. వాటితో కలిపి ప్లాట్లు వేసేశారు. దాంతో వర్షం కురిస్తే నీరు ఇప్పుడు లేఅవుట్ మీదుగా ప్రవహిస్తోంది. వరద నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా లేఅవుట్ రూపొందించే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కనీసం కొండల చుట్టూ ట్రెంచ్‌లు ఏర్పాటుచేసి ఆ నీటిని చెరువులకు మళ్లించాలి. అవేమీ జరగకపోవడంతో ప్రస్తుతం లేఅవుట్ నీట మునిగే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-05-04T01:34:42+05:30 IST