Adani Ioc: అదానీపై ఐవోసీ లవ్!
ABN, First Publish Date - 2023-02-21T02:58:42+05:30
గంగవరం పోర్టును దక్కించుకోవడంలోనే కాదు... ఆ పోర్టులో లావాదేవీలు పెంచుకోవడంలోనూ ‘అదానీ’ అడ్డగోలుగా వ్యవహరిస్తోందా
అయాచిత లబ్ధి చేకూర్చేందుకే ఎల్పీజీ దిగుమతిపై డీల్
పెట్రో ఉత్పత్తుల హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టుదే పైచేయి
అదానీపై ప్రేమతో... ఎఫ్‌పీవోలో పెట్టుబడి పెట్టాలని కేంద్రంలోని కొందరు పెద్దలు నేరుగా పారిశ్రామికవేత్తలను కోరారు.
అదానీపై అభిమానంతో... ఆయన సంస్థల్లో ఎల్‌ఐసీతో పెట్టుబడులు పెట్టించారు.
అదానీపై ఆప్యాయతతో... విదేశాల్లోనూ ఆయన తరఫున రాయబారాలు నడిపారు!
కేంద్రప్రభుత్వంతో అదానీ బంధంపై విపక్షాలు ఇప్పటిదాకా చేస్తున్న ఆరోపణలివి. ఇదే క్రమంలో... అదానీకి చెందిన గంగవరం పోర్టుకు మంచి బేరం ఇచ్చేలా ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐవోసీ)ను కూడా ఒప్పించారా? గంగవరం పోర్టుతో ఐవోసీ ఒప్పందం (ఎంవోయూ) వెనుక ఏం జరిగింది? ఈ ‘డీల్’ తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకా? లేక... అచ్చంగా అదానీకి ‘ఫేవర్’ చేసేందుకా?
విశాఖ పోర్టుకు దశాబ్దాల అనుభవం.. ప్రత్యేకంగా బెర్తులు
గంగవరం పోర్టుకు అలాంటి అనుభవమే లేదు
అయినా.. కొత్తగా గంగవరం పోర్టుతో ఐవోసీ డీల్
ఏటా 3 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతిపై ఎంవోయూ
హిండెన్ బర్గ్ రచ్చతో బయటపడిన రహస్యం
సమర్థించుకునేందుకు ఐవోసీ నానా తంటాలు
విశాఖ పోర్టును ‘తక్కువ’ చేస్తూ ప్రకటనలు
పెద్ద నౌకలు రావని, డెమరేజ్ ఎక్కువని అబద్ధాలు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
గంగవరం పోర్టును దక్కించుకోవడంలోనే కాదు... ఆ పోర్టులో లావాదేవీలు పెంచుకోవడంలోనూ ‘అదానీ’ అడ్డగోలుగా వ్యవహరిస్తోందా? ప్రభుత్వరంగ చమురు సంస్థ ఐవోసీతో కుదుర్చుకున్న ఎంవోయూ మతలబు ఏమిటి? రాజకీయ, పారిశ్రామిక వర్గాలు సంధిస్తున్న ప్రశ్నలివి! అదానీకి లాభాల వర్షం కురిపించేందుకే గంగవరం పోర్టు నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) దిగుమతి చేసుకునేందుకు ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుందని... ఇది పక్కా ‘ఫేవర్’ అని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ సంస్థను కష్టాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తమ పరిస్థితి బాగుందని, వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పేందుకు అదానీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘గంగవరం పోర్టులో ఎల్‌పీజీ దిగుమతికి ఐవోసీతో ఒప్పందం కుదిరింది’ అని తెలిపింది. ఇది మరో వివాదానికి కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐవోసీ టెండరు పిలవకుండా గంగవరం పోర్టుకు ఈ టెండరు ఎలా కట్టబెట్టింది? ప్రభుత్వానికి చెందిన విశాఖ పోర్టు ఉండగా. కొత్తగా అదానీ పోర్టుతో ఒప్పందం ఎందుకు? అసలీ ఒప్పందాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారంటూ విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో... ఐవోసీకి వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘గంగవరం రేవుకు పెద్దపెద్ద ట్యాంకర్లు వచ్చే అవకాశముంది. ఎల్‌పీజీ దిగుమతికి అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల సమయం కలిసి వచ్చి డెమరేజెస్ చార్జీలు (రేవులో నౌకలు వేచి ఉండేందుకు చెల్లించాల్సిన రుసుము) తగ్గుతాయి. విశాఖ పోర్టు నుంచి ఏటా 7 లక్షల టన్నులు, అదానీ పోర్టు నుంచి 3 లక్షల టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకుంటాం’’ అని తెలిపింది. అయితే... ఈ వివరణతో మరిన్ని సందేహాలు తలెత్తాయి.
అదానీకి ఎందుకు?
గంగవరం పోర్టు ఇప్పటివరకు పెట్రోలియం ఉత్పత్తులను (చమురు, గ్యాస్) హ్యాండిల్ చేయలేదు. అవసరమైన బెర్తులూ పోర్టులో లేవు. విశాఖ పోర్టుకు మాత్రం ఈ విషయంలో సుదీర్ఘ అనుభవం ఉంది. హెచ్‌పీసీఎల్, ఐఓసీ తదితర సంస్థల ఉత్పత్తుల దిగుమతి కోసం అక్కడ ప్రత్యేకంగా ఆయిల్ రిఫైనరీ బెర్తులు (ఓర్-1, ఓర్-2) ఉన్నాయి. ఇవి కాకుండా వ్యూహాత్మక చమురు ఉత్పత్తుల నిల్వల కోసం హెచ్‌పీసీఎల్ భూగర్భంలో నిర్మించిన కేవన్‌కు నేరుగా ఉత్పత్తులను పంపడానికి మరో బెర్తు ఉంది. ఇవన్నీ కాదని... అసలీ రంగంలో అనుభవంలేని, దిగుమతులకు వసతుల్లేని అదానీతో ఐవోసీ ఒప్పందం కుదర్చుకోవడం విశేషం. విశాఖ పోర్టుకు భారీ రేవులు రాలేవనడం మరో అబద్ధం. ఈ పోర్టులోకి పెద్ద పెద్ద నౌకలు నేరుగా వచ్చి ఉత్పత్తులను దిగుమతి చేయొచ్చు. ఇవి నేరుగా పైపులైన్ల ద్వారా ఆయా సంస్థలకు చేరతాయి. కొన్ని దశాబ్దాలుగా విశాఖ పోర్టులో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు జరుగుతున్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ... అదానీకి చెందిన గంగవరం పోర్టుతో ఎల్పీజీ దిగుమతికి ఐవోసీ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. గంగవరంలో డెమరేజెస్ చార్జీలు తగ్గుతాయనడమూ అబద్ధమేనని నిపుణులు చెబుతున్నారు. విశాఖ పోర్టులో చమురు ఉత్పత్తుల దిగుమతికి ప్రత్యేక బెర్తులు ఉన్నాయి. పెట్రో ఉత్పత్తులతో నౌకలు రోజూ రావు. వచ్చిన నౌక ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరమూ లేదు. అందువల్ల డెమరేజ్ చార్జీలు ఎక్కువ కావు.
ఎవరికి ‘మేలు?’
ఐవోసీ డీల్‌వల్ల లాభపడేది గంగవరం పోర్టే. పైగా... ఏడాదికి 5 లక్షల టన్నుల దిగుమతికి ఒప్పందం కుదిరిందని.. ఆ మేరకు దిగుమతి జరిగినా జరగకపోయినా డబ్బులు మాత్రం ఐవోసీ చెల్లిస్తుందని (టేక్ ఆర్ పే) అదానీ బహిరంగంగా చెప్పింది. అయితే దిగుమతి చేసుకునేది 3 లక్షల టన్నులే అని, ‘టేక్ ఆర్ పే’ నిబంధన ఎంవోయూలో లేదని ఐవోసీ చెప్పడం గమనార్హం. ఇదంతా అదానీకి లాభం తెచ్చిపెట్టే ప్రయత్నంలో భాగమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోర్టుల్లో సరుకులు ఎగుమతి, దిగుమతి చేసుకుంటే... వ్యాపారుల నుంచి కొన్ని రకాల చార్జీలు వసూలు చేస్తారు. ప్రభుత్వ పోర్టులన్నిటికీ టాంప్ (టారిఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్సు) ధరలు నిర్ణయిస్తుంది. ప్రైవేటు పోర్టుల ధరలు వేరేగా ఉంటాయి. వ్యాపారులను ఆకర్షించడానికి రాయితీలు ఇస్తారు. పక్కపక్కనే పోర్టులున్నప్పుడు పోటీకి ధరలు తగ్గిస్తారు. కానీ గంగవరం పోర్టు విశాఖ పోర్టు కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. సాధారణంగా పోర్టు డ్యూస్, పైలటేజ్, బెర్త్ హైర్, వార్‌ఫేజ్ చార్జీలు, సరకుల నిల్వకు పోర్టు ఆవరణలో తీసుకున్న స్థలానికి ఎకరాల చొప్పున కట్టాల్సిన అద్దె వంటివి ఉంటాయి. గంగవరంలో ఇవన్నీ విశాఖ పోర్టు కంటే తక్కువైతే ఐఓసీకి లాభం. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందమేంటో బయటపెడితే... అది ఎవరికి లాభమో తేలుతుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అదానీ సంస్థ ఈ విషయం గురించి చెప్పాక.. ‘అబ్బే ఇది ఎంవోయూ మాత్రమే. దీనిపై మేం ముందుకెళ్లి తీరాలన్న నిబంధనే లేదు. దీనికి కట్టుబడాల్సిన అవసరం లేదు’ అని ఐవోసీ తెలిపింది. అదానీపై ‘హిండెన్‌బర్గ్’ నివేదికతో రచ్చ జరగకపోతే... బహుశా ఈ ఎంవోయూ అమలులోకి వచ్చేదేమో! ప్రభుత్వరంగంలోని విశాఖ పోర్టును కాదని గంగవరం పోర్టును ఎంచుకోవడమేగాక... విశాఖ పోర్టుకు పెద్ద పెద్ద నౌకలు రావంటూ దుష్ప్రచారం చేయడం మరో దుర్మార్గం!
Updated Date - 2023-02-21T04:12:02+05:30 IST