అనకాపల్లి, పరవాడలో భారీ వర్షం
ABN, First Publish Date - 2023-08-11T01:19:12+05:30
వాతావరణ అనిశ్చితి ప్రభావంతో గురువారం సాయంత్రం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దఫదఫాలుగా వర్షం పడింది. పరవాడ మండలం తాడి గ్రామంలో అత్యధికంగా 117.25 మి..మీ. భారీ వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా తాడిలో 117.25 మి.మీ.లు నమోదు
ఎరుకువానిపాలెంలో 100.5, సాలాపువానిపాలెంలో 99 మి.మీ.లు..
లోతట్టు ప్రాంతాలు జలమయం
విశాఖపట్నం/ అనకాపల్లి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వాతావరణ అనిశ్చితి ప్రభావంతో గురువారం సాయంత్రం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దఫదఫాలుగా వర్షం పడింది. పరవాడ మండలం తాడి గ్రామంలో అత్యధికంగా 117.25 మి..మీ. భారీ వర్షపాతం నమోదైంది. అనకాపల్లి మండలం ఎరుకువానిపాలెంలో 100.5 మి.మీ.లు, పరవాడ మండలం సాలాపువానిపాలెంలో 99.0 మి.మీ.లు, లంకెలపాలెంలో 92.25, పరవాడలో 87.5, అనకాపల్లిలోని కొండకొప్పాకలో 75 మి.మీ.ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కశింకోట, మునగపాక, సబ్బవరం మండలాల్లోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది.
అనకాపల్లిలో గంటపాటు కుండపోత
పట్టణంలో 55.1 మిల్లీమీటర్ల వర్షం
అనకాపల్లి టౌన్, ఆగస్టు 10: అనకాపల్లి పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు కుండపోతగా వాన పడింది. సుమారు రెండు వారాల తరువాత వర్షం పడడం, వాతావరణం చల్లబడడంతో పట్టణవాసులు ఉపశమనం చెందారు. కాగా 55.1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయరామరాజుపేట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద మూడు అడుగుల లోతున నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ, ఉడ్‌పేట, గవరపాలెం, ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి కాలువలను తలపించాయి.
పరవాడలో...
పరవాడ, ఆగస్టు 10: మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో హోర్డింగులు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Updated Date - 2023-08-11T01:19:12+05:30 IST