స్వచ్ఛసర్వేక్షణ్ పోటీకి జీవీఎంసీ సన్నద్ధం
ABN, First Publish Date - 2023-06-26T01:12:48+05:30
స్వచ్ఛసర్వేక్షణ్-2023 పోటీకి జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
స్వచ్ఛసర్వేక్షణ్ -2023లో
మొత్తం మార్కులు 9,500
సేవలకు 4,525
సర్టిఫికెట్లకు 2,500
సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 2,475
------------------
సర్వే కోసం జూలై రెండో వారంలో నగరానికి రానున్న కేంద్ర బృందం
మొదటి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా అధికారుల కార్యాచరణ
సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌పైనే ప్రత్యేక దృష్టి
ప్రజల్లో అవగాహన పెంచే లా కార్యక్రమాలకు రూపకల్పన
ఈ ఏడాది 9,500 మార్కులకు పోటీ
(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)
స్వచ్ఛసర్వేక్షణ్-2023 పోటీకి జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల రెండోవారంలో కేంద్ర బృందం నగరంలో ఐదు రోజులపాటు సర్వే నిర్వహించే అవకాశం ఉందనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. పోటీలో మొదటి ర్యాంక్ దక్కించుకోవడమే లక్ష్యంగా అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ప్రతిభ చూపేందుకు కమిషనర్ సాయికాంత్‌వర్మ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
దేశంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబరు రెండున స్వచ్ఛభారత్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల మధ్య పరిశుభ్రత మెరుగుపరచడంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా ఏటా స్వచ్ఛసర్వేక్షణ్ పేరుతో సర్వే నిర్వహిస్తోంది. పారిశుధ్యం మెరుగుపరచడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేందుకు వీలుగా పలు కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. పోటీలో పాల్గొనే పట్టణాలు, నగరాలు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ పోర్టల్‌లో తమ ఆసక్తిని తెలియజేయాలి. జనాభా ఆధారంగా కేటగిరీలుగా విభజించి సర్వే నిర్వహిస్తారు. పోటీలో ఉన్న స్థానిక సంస్థలు ప్రజలకు అందిస్తున్న సేవలు, ఇతర సౌకర్యాలతోపాటు చెత్త పునర్విభజన, కాలుష్య నియంత్రణకు చేస్తున్న కృషి వంటి అంశాల్లో చూపుతున్న అంకితభావం, అమలుచేస్తున్న విధానాలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కొంతమంది అధికారులను కమిటీగా నియమించి సర్వేకు పంపిస్తుంది. ఈ బృందాలు ఒక్కో నగరంలో ప్రజలకు పరిశుభ్రత, చెత్త విభజన, చెత్తను సంపదగా మార్చడం, సమస్యలను పరిష్కరించుకునే అవగాహన, స్థానిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు, అమలుచేస్తున్న పథకాల్లో ప్రజా భాగస్వామ్యం, పరిశుభ్రత కోసం ఆ సంస్థలు చేస్తున్న కృషి, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెత్తను శాస్త్రీయంగా పునర్వినియోగం చేయడం, బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల జవాబుదారీతనం వంటి అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తాయి.
మొదటి ర్యాంక్ లక్ష్యంగా ప్రణాళికలు
స్వచ్ఛసర్వేక్షణ్-2023లో పది లక్షలు జనాభా దాటిన నగరాల కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ అధికారులు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్ ప్రారంభమైన 2015లో జీవీఎంసీ ఈ కేటగిరీలో 237, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23, 2020లో తొమ్మిదో ర్యాంక్ సాధించింది. 2021లో కరోనా కారణంగా సర్వే నిలిచిపోగా, 2022లో మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఈ ఏడాది మరింత ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా మొదటి ర్యాంక్ సాధించడమే ధ్యేయంగా కమిషనర్ సాయికాంత్‌వర్మ కార్యాచరణ ప్రకటించారు.
ఇదీ కార్యాచరణ
నగరంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించడం, బీచ్‌తోపాటు ఎంఎస్‌ఎఫ్‌లకు చేరుతున్న చెత్తను ఎప్పటికప్పుడు కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డ్‌కు తరలించడం. ఇంటి వద్దనే చెత్తనే వేరు చేయించడం, తడి చెత్తను అపార్ట్‌మెంట్లలో సేంద్రియ ఎరువుగా మార్చి మొక్కల పెంపకానికి వాడుకోవడం, ప్రతి ఇంటి నుంచి శతశాతం చెత్తసేకరణ, రోడ్లు, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై జోనల్ కమిషనర్లు, కిందిస్థాయి అధికారులతో కమిషనర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ఆయా అంశాల్లో పురోగతి తెలుసుకునేందుకు వీలుగా తనిఖీలు చేస్తున్నారు.
9,500 మార్కులకు పోటీ
ఈ ఏడాది స్వచ్ఛసర్వేక్షణ్ పోటీని మూడు విభాగాలుగా విభజించి గరిష్ఠంగా 9,500 మార్కులుగా నిర్ణయించారు. ఇందులో 4,525 మార్కులను ప్రజలకు అందించే సేవలకు కేటాయించారు. చెత్తసేకరణ, వీధులు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం, యూజీడీ నిర్వహణలో లోపాలు సరిచేసుకోవడం, రోడ్లపై పోగైన చెత్తను ఎప్పటికప్పుడు తరలించడం, డంపర్‌బిన్లను పరిశుభ్రంగా ఉంచడం, సకాలంలో ఖాళీ చేయడం, పక్కాగా వీధిలైట్ల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణలో కఠినంగా వ్యవహరించడం, దుకాణాలు, వాణిజ్యసముదాయాల నుంచి చెత్తను సేకరించడంలో పనితీరు ఆధారంగా మార్కులు దక్కుతాయి. చెత్త నుంచి విద్యుత్, ఎరువుల తయారీ, యార్డులో పేరుకుపోయిన లెగసీవేస్ట్‌ను బయోమైనింగ్ ద్వారా ఎరువులు, ఇతర వస్తు తయారీకి ఉపయోగపడే ముడిసరుకుగా మార్చడం, మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగం, బహిరంగ మల, మూత్రవిసర్జన నియంత్రణకు తీసుకున్న చర్యలపై అందుకున్న సర్టిఫికెట్లకు 2,500 మార్కులు కేటాయిస్తారు. ఇంకా జీవీఎంసీ పనితీరుపై నగరవాసులు తమ అభిప్రాయాన్ని చెప్పడంతోపాటు సమస్యలను ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేస్తే, ఎంతసేపటిలో పరిష్కరించారనేదానికి 2,475 మార్కులు కేటాయించారు.
ప్రథమ స్థానమే ధ్యేయం
స్వచ్ఛసర్వేక్షణ్- 2023లో మొదటి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా కమిషనర్ సాయికాంత్‌వర్మ ఆధ్వర్యంలో ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నాం. ఇప్పటికే గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీలో ఫైవ్‌స్టార్ సర్టిఫికెట్, వాటర్ ప్లస్ నగరంగా సర్టిఫికెట్ పొందాం. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చేలా స్వచ్ఛతా యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, ఫిర్యాదులు చేసేలా అన్నిజోన్ల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సమస్య పరిష్కారం కాగానే ఫిర్యాదుదారుడికి తెలియజేసేలా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత ఏడాది మూడో ర్యాంక్ లభించగా, ఈ ఏడాది మొదటి ర్యాంక్ సాధించేందుకు ప్రజల సహకారం, భాగస్వామ్యం కోరుతున్నాం.
- డాక్టర్ వి.సన్యాసిరావు, అదనపు కమిషనర్
Updated Date - 2023-06-26T01:12:48+05:30 IST