ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Geetam University: గీతంలో అర్ధరాత్రి హడావుడి

ABN, First Publish Date - 2023-04-15T02:53:13+05:30

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో తీర్పులు వచ్చినప్పుడు, విశాఖకు సంబంధించిన నిర్ణయాలను తప్పు పట్టినప్పుడు... వాటినుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ గిమ్మిక్కులు ప్రదర్శించడం అలవాటుగా మార్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖలో మరోసారి అధికారుల అలజడి

గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమికి కంచె

దాదాపు పదిగంటలపాటు రోడ్ల దిగ్బంధం

కోడికత్తి, రుషికొండ అంశాల నుంచి

జనం దృష్టిని మరల్చేందుకేనా?

విశాఖపట్నం/ఎండాడ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో తీర్పులు వచ్చినప్పుడు, విశాఖకు సంబంధించిన నిర్ణయాలను తప్పు పట్టినప్పుడు... వాటినుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ గిమ్మిక్కులు ప్రదర్శించడం అలవాటుగా మార్చుకుంది. దీనికోసం గీతం విశ్వవిద్యాలయం పరువును మరోసారి రోడ్డున పడేయడానికి ప్రయత్నించింది. రుషికొండలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుగుతున్నాయని కేంద్ర కమిటీ హైకోర్టుకు నివేదిక సమర్పించడం, విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి ఘటనలో కుట్ర లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేయడం, విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిని అడ్డదారిలో ప్రభుత్వ పెద్దలు దక్కించుకున్నారనే విమర్శలు ఒకేసారి రావడంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇవన్నీ ప్రజల్లోకి వెళితే వ్యతిరేకత పెరుగుతుందని, వాటి గురించి చర్చ జరగకుండా వారి దృష్టిని మరల్చడానికి ఎత్తుగడ వేసింది. గీతం ప్రాంగణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటికి కంచె వేస్తున్నామని, అందుకే ఎవరినీ అనుమతించడం లేదంటూ పోలీసులు గురువారం అర్ధరాత్రి హడావుడి చేశారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో మోహరించారు. ఇటు ఎండాడ, అటు రుషికొండ, ఇంకొకవైపు భీమిలి మార్గాల నుంచి గీతం విశ్వవిద్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు. శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగాయి. గుర్తింపు కార్డు చూపినవారిని మాత్రమే ఆ మార్గంలోకి అనుమతించారు.

రోగులకు అవస్థలు

మధుమేహం కలిగిన రోగులు రక్తపరీక్షలు చేయించుకోవడానికి ఉదయాన్నే ఏమీ తినకుండా గీతం ఆస్పత్రికి వెళతారు. అటువంటి వారిని సైతం ఆపేశారు. మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. రుషికొండ ఐటీ పార్కుకు వెళ్లేవారిలో ఐడీ కార్డులు లేనివారిని అడ్డుకున్నారు. తాము కంపెనీల యజమానులమని, ఐడీ కార్డులు ఉద్యోగులకు మాత్రమే ఉంటాయని చెప్పినా పోలీసు అధికారులు వినిపించుకోలేదు. దీంతో చాలా మంది ఉదయాన్నే విదేశీ కంపెనీలతో మాట్లాడాల్సిన జూమ్‌ కాల్స్‌ మిస్‌ అయ్యారు. సాగర్‌నగర్‌ నుంచి రుషికొండ వరకు పర్యాటకులు అధికం. వారి వాహనాలను కూడా అడ్డుకోవడంతో చాలామంది పిల్లాపాపలతో కాలినడకన టిఫిన్ల కోసం వెళ్లాల్సి వచ్చింది. డీసీపీ బంగారునాయుడు, ఏసీపీలు త్రినాథరావు, చుక్కా శ్రీనివాసరావులు సీఐలతో కలిసి వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించారు.

ఇది మూడోసారి...

గీతం విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని రెవెన్యూ అధికారులు జేసీబీలు, ఇతర యంత్రాలు, భారీ బలగాలను తీసుకొని వెళ్లడం, రహదారులను దిగ్బంధించడం ఇది మూడోసారి. గీతం యాజమాన్యమే తమ సంస్థ పక్కనున్న ప్రభుత్వ భూములు అవసరమని, వాటిని కేటాయించాలని కోరుతూ గతంలో ప్రభుత్వాన్ని కోరింది. ఆ విషయాలను పక్కనపెట్టి ఆక్రమించారంటూ 24 అక్టోబరు 2020న మొదట దాడి చేశారు. అప్పుడు యూనివర్సిటీ ప్రవేశ ద్వారాన్ని, ప్రహరీని కూల్చేశారు. అప్పుడు కూడా అధికారులు నానా హంగామా చేశారు. దానిపై గీతం న్యాయస్థానాన్ని ఆక్రమించింది. ఆ తరువాత మళ్లీ 6 జనవరి, 2022న తెల్లవారు జామున రోడ్లు మూసేసి, భారీబందోబస్తుతో గీతంలోకి వెళ్లారు. అప్పుడు గుర్తించిన భూమికే కొలతలు వేసి సర్వే రాళ్లు పాతి, కంచె వేశారు. శుక్రవారం కూడా అలాగే చేశారు.

4.74 ఎకరాల్లో కంచె: భాస్కరరెడ్డి, ఆర్‌డీవో

‘‘ఎండాడ సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఈ రోజు కంచె వేశాం, సర్వే నంబరు 20లో 1.02 ఎకరాలు, మరో చోట 1.19 ఎకరాలు, సర్వే నంబరు 16లో 0.66 ఎకరాలు, సర్వే నంబరు 15లో 1.17 ఎకరాలు, సర్వే నంబర్‌ 19లో 0.70 ఎకరాలు మొత్తం 4.74 ఎకరాల్లో కంచె ఏర్పాటు చేశాము. 40 ఎకరాలకు సంబంధించి వివాదం నడుస్తుండగా, అందులో మరో 14 ఎకరాలకు సంబంధించి న్యాయ పరమైన అంశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి’’

Updated Date - 2023-04-15T02:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising