గవరపాలెంలో ఘనమైన వేడుక
ABN, First Publish Date - 2023-01-29T01:06:11+05:30
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది.
అనకాపల్లి టౌన్, జనవరి 28 : ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆలయంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో అధిష్ఠించారు. అనంతరం ఊరేగింపును మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రారంభించారు. ఉద్యోగ, వ్యాపారాలపై సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కుటుంబాలతో సహా ఈ వేడుకకు హాజరు కావడంతో ఎటు చూసిన జనసందోహమే కనిపించింది. ఏ ఇల్లు చూసినా బంధుగణంతో కళకళలాడింది. గవరపాలెంలోని రహదారులన్నీ సందడిగా మారాయి. ఈ ఉత్సవంలో భాగంగా సుమారు 40 స్టేజీలు ఏర్పాటు చేసి రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గరగల నృత్యాలు, తీన్‌మార్ డప్పుల వాయిద్యాలు, పులివేషాలు, కోలాటాలు, బుట్టబొమ్మలు, కళాకారులచే కాంతారా విన్యాసాలు, దాండియా డ్యాన్స్, కేరళ వాయిద్యం, గారడీ, పూణే బ్యాండ్‌తో పాటు వివిధ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుద్దీపాలంకరణ వేడుకకే వన్నెతెచ్చింది.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
గౌరీ పరమేశ్వరులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దర్శించుకున్నారు. ఆయనకు ఉత్సవ కమిటీ చైర్మన్ సంతోష్ అప్పారావునాయుడు ఆధ్వర్యంలో అంతా స్వాగతం పలికారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, డాక్టర్ రామ్మూర్తి, జాజుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇదిలావుంటే, నూకాంబిక దేవస్థానం తరఫున వైసీపీ నేత దాడి జయవీర్, ఈవో చంద్రశేఖర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, పోలవరపు త్రినాథ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా కమిటీ ప్రతినిధులు కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కమిటీ ప్రతినిధులు కొణతాల శ్రీనివాసరావు, కొణతాల నూకమహాలక్ష్మినాయుడు, కొణతాల మురళీకృష్ణ, పీవీ రమణ, కొణతాల కృష్ణంరాజు, కోరిబిల్లి సత్యనారాయణ, మద్దాల ఓంశివ, పెంటకోట సన్యాసినాయుడు, కర్రి రుద్రినాయుడు, మద్దాల చిరంజీవి ఏర్పాట్లు చేపట్టారు.
భారీ బందోబస్తు
ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. అనకాపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, సీసీఎస్ పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసులు, హోంగార్డులు 300 మందికి పైగా బందోబస్తులో పాల్గొన్నారు.
Updated Date - 2023-01-29T01:06:13+05:30 IST