పిడుగుపాటుకు రైతు మృతి
ABN, First Publish Date - 2023-04-03T01:47:16+05:30
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిశాయి.
రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన.. కొన్ని చోట్ల ఠారెత్తించిన ఎండ
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), పెదకూరపాడు, ఏప్రిల్ 2: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించాయి. ఉత్తర ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, కోస్తా, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదరుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలకొంది. కర్నూలులో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో సాయంత్రం భారీ గాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టలు కప్పేందుకు వెళ్లిన రైతు ఏనుగుల నరసింహారావు(45) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. నరసింహారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదరుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2023-04-03T01:47:16+05:30 IST