దేవుడి పేరిట దోపిడీ!
ABN, First Publish Date - 2023-09-25T00:47:18+05:30
దేవుడు పేరిట దోపిడీ జరుగుతోంది. గణేష్ నవరాత్రోత్సవాల ముసుగులో నిర్వాహకులు దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గణేష్ ఉత్సవం ముసుగులో దందా!
అనువుగా లేని స్థలంలో నిర్వహణకు అనుమతులు
ఉత్సవ ప్రాంగణంలో నిబంధనల అతిక్రమణ
దర్శనానికి టికెట్టు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులు
పర్మిషన్ లేకుండా స్టాల్స్, ఎగ్జిబిషన్ల ఏర్పాటు
సీపీ దృష్టికి తీసుకువెళ్తామంటున్న గాజువాక ప్రజా సంఘాలు
గాజువాక, సెప్టెంబరు 24:
దేవుడు పేరిట దోపిడీ జరుగుతోంది. గణేష్ నవరాత్రోత్సవాల ముసుగులో నిర్వాహకులు దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా, పూర్తిస్థాయి అనుమతులు తీసుకోకుండా ఉత్సవం నిర్వహిస్తుండడమే కాకుండా భక్తుల నుంచి దర్శనానికి టికెట్లు వసూలు చేయడమపై విమర్శలు రేగుతున్నాయి. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి.
గాజువాక లంకా గ్రౌండ్‌లో 117 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని నెలకొల్పి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవ నిర్వహణకు అనువుగా లేని, చిన్న గ్రౌండ్‌లో 117 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటుకు పోలీస్‌శాఖ ఎలా అనుమతించిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తిస్థాయి అనుమతులు తీసుకోకుండానే నిర్వాహక కమిటీ ఉత్సవాలను నిర్వహిస్తోందని, ఈ క్రమంలో దందాలకు అడ్డులేకుండా ప్రభుత్వ శాఖల అధికారులకు ముడుపులు చెల్లించదనే ప్రచారం జరుగుతోంది. భారీ గణనాథుడినికి దర్శించేకునేందుకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంతోబాటు నగరం, అనకాపల్లి ప్రాంతాలనుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఒక్క ఆదివారమే ఉదయం నుంచి రాత్రి వరకూ సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చినట్టు సమాచారం.
స్టాల్స్ ఏర్పాటుతో వసూళ్లు..
ఉత్సవాల్లో భాగంగా 30 రకాల స్టాల్స్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్న నిర్వాహక కమిటీ ఏకంగా 60 స్టాల్స్ ఏర్పాటు చేయించడంతో పాటు ఒక్కో స్టాల్ నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో అనధికారికంగా ఎగ్జిబిషన్ నిర్వహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తులకు నిలువుదోపిడీ...
భారీ గణేష్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు రూ.25, రూ.50, రూ.100 చొప్పున టికెట్లు వసూలు చేయడంపైనా విమర్శలు రేగుతున్నాయి. ఉచిత దర్శనం కల్పించకుండా ఇలా డబ్బు వసూల చేస్తుండడంపై కొంతమంది భక్తులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఉత్సవకమిటీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. అంతేకాకుండా స్టాల్స్‌లో సామగ్రికి అధికధరలు వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు తూట్లు
ఉత్సవ ప్రాంగణంలో కనీస నిబంధనలు పాటించకపోవడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయకపోవడం, ప్రస్తుతం వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ప్రాంగణంలో నీరు నిల్వ ఉండడంతో బాటు బురదమయమవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పార్కింగ్ ప్లేస్ లేక ట్రాఫిక్ ఇక్కట్లు
ఉత్సవ ప్రాంగణంలో పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో వాహనాలను జాతీయరహదారి నిలిపి ఉంచేస్తున్నారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జాతీయరహదారి, పాతగాజువాక ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 వరకూ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గణేష్ ఉత్సవం పేరిట జరుగుతున్న దందాలపై పోలీసులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-09-25T01:15:31+05:30 IST