అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN, First Publish Date - 2023-04-03T23:46:41+05:30
స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు పరిశీలించి నిర్లక్ష్యం చేయకుండా అర్జీదారులకు తగిన న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి
అనకాపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు పరిశీలించి నిర్లక్ష్యం చేయకుండా అర్జీదారులకు తగిన న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన 189 మంది నుంచి ఫిర్యాదులను కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలపై అర్జీలు సేకరించారు. అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ అర్జీలు అందిన 24 గంటల్లో వాటిని పరిశీలించి పరిష్కరించవచ్చా? లేక తిరస్కరించవచ్చా అనేది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక అర్జీని తిరస్కరించాల్సి వస్తే సరైన కారణాలు చెప్పేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. దరఖాస్తు దారుడి సమస్యను తెలుసుకోకుండా తిరస్కరిస్తే సహించేది లేదన్నారు. ఏపీ సేవ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందనలో సోమవారం అందిన ఫిర్యాదుల్లో ప్రధానంగా అనకాపల్లి మండలం రేబాక గ్రామ సర్వే నంబర్ 99లో ప్రభుత్వ భూమిలో ఆర్కే అనే పేరుతో అనధికార లేఅవుట్, అక్రమ నిర్మాణాలను వీఆర్‌ఓ ప్రోత్సహిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల సంఖ్యను పెంచాలని, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వేల సంఖ్యలో దివ్యాంగులైన నిరుద్యోగులుంటే పదుల సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, పోస్టుల సంఖ్యను పెంచాలని దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కోరాడ అప్పలస్వామినాయుడు, సభ్యులు భాస్కరరావు, ధనలక్ష్మి, అన్నపూర్ణ, కృష్ణవేణి తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేవారు.
జిల్లా ఎస్పీకి అందిన 22 ఫిర్యాదులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ గౌతమి శాలి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంఽధిత పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Updated Date - 2023-04-03T23:46:41+05:30 IST