కార్పొరేటరా!...మజాకా!!
ABN, First Publish Date - 2023-06-07T01:05:16+05:30
ఆయనో కార్పొరేటర్. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తరువాత వైసీపీకి మద్దతు ప్రకటించారు.
చినరుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనం నిర్మాణం
ప్లాన్ కంటే అదనంగా అంతస్థులు
రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని వాణిజ్య సముదాయం
అనుమతి లేకుండా సబ్ సెల్లార్...
రోడ్ విస్తరణ కోసం జీవీఎంసీకి ఇచ్చిన స్థలంలోనూ పనులు
ప్లాన్ కాల పరిమితి దాటిపోయినా రెన్యువల్ చేయించుకోని వైనం
జీవీఎంసీకి కట్టాల్సిన ఫీజులు ఎగనామం
పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ అధికారులు
అధికార పార్టీకి మద్దతుదారుడు కావడంతో మౌనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆయనో కార్పొరేటర్. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తరువాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు అధికార పార్టీ నేతలు ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇప్పుడు అదే కార్పొరేటర్ ‘పెద్దల’ అండదండలు ఉన్నాయనే ధీమాతో నిబంధనలకు విరుద్ధంగా చినరుషికొండలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. నివాస భవనానికి అనుమతులు తీసుకుని వాణిజ్యానికి అనువుగా నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి జీవీఎంసీ జారీచేసిన ప్లాన్ కాలపరిమితి దాటిపోయింది. అదనపు ఫీజులు చెల్లించి ప్లాన్‌ను రెన్యువల్ చేయించుకోవాల్సి ఉన్నా నిర్మాణదారుడు పట్టించుకోలేదు. స్థానికులు కొందరు ఫిర్యాదు చేసినా టౌన్‌ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
జీవీఎంసీ కార్పొరేటర్ ఒకరు చినరుషికొండ వద్ద సుమారు 260 గజాల స్థలంలో నివాస భవనం నిర్మాణం కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. సెల్లార్+నాలుగు అంతస్థులు నిర్మాణానికి అనుమతిస్తూ జీవీఎంసీ 2020 ఫిబ్రవరి 11న ప్లాన్ జారీచేసింది. ప్లాన్ జారీ అయిన తర్వాత మూడేళ్లలో భవన నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. మూడేళ్లలో పూర్తికాని పక్షంలో ప్లాన్ రెన్యువల్ కోసం గతంలో చెల్లించిన ఫీజులో సగం చెల్లించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వచ్చిన తర్వాత టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ భవనం వద్దకు వెళ్లి గతంలో జారీచేసిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగిందా?, లేదా?...అనేది తనిఖీ చేయాలి. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారణ అయితేనే ప్లాన్ రెన్యువల్ చేయాలి. అలాకాకుండా ఉల్లంఘనలు జరిగితే ప్లాన్ రెన్యువల్‌కు వచ్చిన దరఖాస్తును తిరస్కరించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి. అయితే సదరు కార్పొరేటర్ భవన నిర్మాణానికి జీవీఎంసీ జారీచేసిన ప్లాన్‌కు విరుద్ధంగా సబ్‌సెల్లార్ నిర్మించారు. అలాగే ప్లాన్‌లో పేర్కొన్నదాని కంటే అదనపు అంతస్థులు నిర్మించారు. ఇక భవిష్యత్తులో రోడ్డు విస్తరణ కోసం కొంత స్థలాన్ని జీవీఎంసీకి సదరు కార్పొరేటర్ గిఫ్ట్‌గా అందజేశారు. ప్లాన్‌లో రెండు రోడ్లు ఉన్నట్టు చూపించడంతో ఆ మేరకు ఇరువైపులా మూడేసి మీటర్లు చొప్పున సెట్‌బ్యాక్ వదలాలి. కానీ అవేవీ కనిపించవు. ఇంకొక ముఖ్యమైన ఉల్లంఘన ఏమిటంటే నివాస అవసరాల కోసం ప్లాన్ తీసుకుని పూర్తిగా వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించేలా నిర్మాణం చేపట్టారు. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులకు చినరుషికొండకు చెందిన కొంతమంది అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు వచ్చిన విషయాన్ని సదరు కార్పొరేటర్‌కు చెప్పారు. దీంతో ఆయన...ఫిర్యాదు చేసిన వారికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది. సామాన్యులు ఎవరైనా నిర్మాణంలో చిన్నపాటి ఉల్లంఘనకు పాల్పడితే ఆగమేఘాల మీద అక్కడ వాలిపోయిన నానా హడావిడి చేసే టౌన్‌ప్లానింగ్, జీవీఎంసీ అధికారులు...ఒక కార్పొరేటర్ నిబంధనలను తుంగలో తొక్కి బహుళ అంతస్థుల భవనం నిర్మించినా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయం టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి వద్ద ప్రస్తావించగా, ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. ప్లాన్ కాలపరిమితి దాటిపోయిన విషయం తమకు తెలియదని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Updated Date - 2023-06-07T01:05:16+05:30 IST