వణికిస్తున్న చలి
ABN, First Publish Date - 2023-01-11T01:04:16+05:30
మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో చలి తీవ్రత సైతం కొనసాగుతున్నది.
- చింతపల్లి, లంబసింగిలో 3, అరకులోయలో 3.5 డిగ్రీలు
పాడేరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడంతో చలి తీవ్రత సైతం కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ఏజెన్సీలో ఉన్న చలి ప్రభావమే మంగళవారం సైతం కొనసాగింది. దీంతో మన్యం వాసులు చలి ధాటికి వణుకుతున్నారు. మంగళవారం ఏజెన్సీలోని అరకులోయలో 3.5, చింతపల్లిలో 4.2, జీకేవీధిలో 4.3, డుంబ్రిగుడలో 4.4, జి.మాడుగులలో 4.7, పాడేరులో 5, ముంచంగిపుట్టు, పెదబయలులో 6.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే పగటి వేళల్లో ఒక మోస్తరు చలి ఉన్నప్పటికీ రాత్రి పూట మాత్రం తీవ్రత అధికంగా ఉంది. దీంతో వయస్సుతో సంబఽంధం లేకుండా అందరూ చలికి భయపడుతున్నారు. రగ్గులు కప్పుకుంటూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరో వారం రోజులు చలి ప్రభావం ఇదే తరహాలో ఉంటుందనే వాతావరణశాఖ ప్రకటనతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా శీతల గాలులు వీస్తున్నాయి. మంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో ఈ ప్రాంత ప్రజలు పగలు, రాత్రి తేడా లేకుండా చలి మంటలు వేసుకుంటున్నారు. 24 గంటలూ ఉన్నిదుస్తులను ధరించి కనిపిస్తున్నారు.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో మంచు దట్టంగా కురుస్తున్నది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు మంచు వీడలేదు. అరకు ప్రధాన రహదారిలో మంచు ఎక్కువ కురుస్తుండడం తో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వీధుల్లో చలి మంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Updated Date - 2023-01-11T01:04:17+05:30 IST