ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిపోకు డొక్కు బస్సులే శరణ్యం

ABN, First Publish Date - 2023-03-02T01:08:55+05:30

కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఇప్పటికే ఈ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆఖరికి పాడేరు డిపోకి బస్సుల కేటాయింపు విషయంలో కూడా వివక్ష చూపుతోందని వాపోతున్నారు.

తిరుపతి డిపో నుంచి పాడేరు డిపోకు చేరుకున్న పాత బస్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- అల్లూరి జిల్లాపై చిన్నచూపు ఎందుకో?

- ప్రస్తుతం ఉన్నవి 39 పాత బస్సులు

- తిరుపతి నుంచి బుధవారం వచ్చినవి నాలుగు పాతవి

- మరో మూడు రానున్నాయి

- ఇవి గతంలో ప్రమాదాలకు గురైనవి.. పది లక్షల కిలో మీటర్ల మేర తిరిగినవి

- ఘాట్‌ రోడ్డులో మొరాయించే అవకాశం ఎక్కువ

- నిర్వహణ కష్టమేనని పీటీడీ సిబ్బంది ఆవేదన

పాడేరురూరల్‌, మార్చి 1:

కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఇప్పటికే ఈ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆఖరికి పాడేరు డిపోకి బస్సుల కేటాయింపు విషయంలో కూడా వివక్ష చూపుతోందని వాపోతున్నారు. జిల్లా ఏర్పడిన తరువాత పాడేరు నుంచి అన్ని ప్రాంతాలకు కనెక్టవిటీ పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో డిపోకు కొత్త బస్సులు వస్తాయని కొంత కాలంగా వేచి చూస్తున్న ప్రజలకు తిరుపతి నుంచి బుధవారం నాలుగు పాత బస్సులను అధికారులు పంపి ఝులక్‌ ఇచ్చారు. మరో మూడు పాత బస్సులు కూడా ఇక్కడికి రావడానికి బయలుదేరాయి.

అల్లూరి జిల్లా ఏర్పడిన కొత్తలో ప్రజా రవాణాశాఖ(పీటీడీ) ఎండీ ద్వారకా తిరుమలరావు పాడేరు డిపోను సందర్శించి కొత్త బస్సులను మంజూరు చేసి అదనంగా కొత్త రూట్లలో నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో పాడేరు డిపోకు 7 కొత్త బస్సులు వస్తున్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ బస్సులను నడపాల్సిన రూట్ల వివరాలపై డిపో మేనేజర్‌కు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నడిపిన బస్సులను పాడేరుకు పంపిస్తున్నట్టు పీటీడీ ఎండీ వెల్లడించారు. కాగా తిరుపతి డిపో నుంచి పాడేరు డిపోకు కేటాయించిన ఏడు బస్సుల్లో నాలుగు పల్లె వెలుగు బస్సులు బుధవారం ఉదయానికి ఇక్కడికి చేరాయి. ఆ నాలుగు బస్సులు ఇప్పటికే తిరుపతిలో తొమ్మిది నుంచి పది లక్షల కిలో మీటర్ల మేర తిరిగినవి కాగా, రోడ్డు ప్రమాదాలకు గురైనవి. దీంతో డిపో సిబ్బంది, గ్యారేజ్‌ సిబ్బంది కంగుతిన్నారు.

నిర్వహణ భారమే..

పాడేరు డిపోలో ప్రస్తుతం 39 పాత బస్సులు ఉన్నాయి. ఇవి 36 రూట్లలో తిరుగుతున్నాయి. ఇందులో రెండు డీలక్స్‌ బస్సులు కాకినాడ, రాజమహేంద్రవరానికి, మూడు ఎక్స్‌ప్రెస్‌లు విశాఖ, కాకినాడ, రంపచోడవరానికి నడుపుతుండగా, మిగిలినవన్నీ పల్లె వెలుగు బస్సులు. ఇవి జిల్లాలో పలు రూట్లలో నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ రోజుకు 12,150 కిలో మీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇవి పాత బస్సులు కావడం, ఇక్కడి డిపోకు రెగ్యులర్‌ మెకానిక్‌లు లేకపోవడంతో వీటి నిర్వహణ కష్టంగా ఉంది. ఈ బస్సులు ఎక్కడబడితే అక్కడ ఆగిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మరో ఏడు పాత బస్సులు ఈ డిపోకు వస్తుండడం ఇక్కడి సిబ్బందికి తలనొప్పిగా మారింది.

పాడేరు ఘాట్‌లో కష్టమే..

పాడేరు డిపో కొండ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఘాట్‌ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి డిపోలో నడుపుతున్న బస్సులు కండీషన్‌లో లేనివి కావడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. డిపో నుంచి వెళ్లిన బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను, కండీషన్‌లో ఉన్నవాటిని ఈ డిపోకు కేటాయించాల్సి ఉంది. దీనిపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిపోకు కొత్త బస్సులు వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-02T01:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!