జర్నలిస్టులపై దాడులు సరికాదు
ABN, First Publish Date - 2023-05-23T02:05:18+05:30
హైదరాబాద్, కర్నూలులో ఇటీవల జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి
ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
ఆర్డీఓకు వినతిపత్రం
అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి):
హైదరాబాద్, కర్నూలులో ఇటీవల జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగినాయుడు మాట్లాడుతూ, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు వెళుతుండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్‌ఎంటీవీ ప్రతినిధులు తమ విధి నిర్వహణలో భాగంగా ఆయనను అనుసరించారని, ఇది సహించలేని ఎంపీ అనుచరులు అమానుషంగా దాడి చేశారని అన్నారు. రిపోర్టర్లను గాయపరిచి, కెమెరాను ధ్వంసం చేసి, వాహనాల అద్దాలను పగులగొట్టారని, ఈ చర్య ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనన్నారు. ఇటువంటి చర్యలను ఏపీయూడబ్ల్యూజే ఖండిస్తుందన్నారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.రాంబాబు మాట్లాడుతూ, పాత్రికేయులపై నానాటికీ దాడులు పెరిగిపోతున్నాయని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా పాత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, పాత్రికేయులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ చిన్నికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు ప్రసాద్‌బాబు, అవ్వ, నటరాజ్, కొండలరావు, మోహన్‌బాబు, గంగాధర్, నూకేష్, రమణాజీ, సీనియర్ పాత్రికేయులు వెంకట్, వీవీ రమణ, జాన్సన్, శ్రీనివాస్, రఘు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-23T02:05:18+05:30 IST