అస్మదీయులకే అందలం
ABN, First Publish Date - 2023-10-07T01:18:48+05:30
ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకులు తమకు కావాల్సిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారు.
ఏయూలో కొనసాగుతున్న అరాచకం
తమకు నచ్చిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్న పాలకులు
తాజాగా సీనియర్‌లను పక్కనపెట్టి జూనియర్‌కు ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు కట్టబెట్టిన వైనం
కంప్యూటర్ సైన్స్ డిపార్టుమెంట్‌లో మరో ఇద్దరికి ఉద్యోగాలు
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకులు తమకు కావాల్సిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఇప్పటికే పలు వురిని ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, విభాగా ధిపతులుగా నియమించుకున్నారు. తాజాగా ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు నియామకంలో కూడా అదే ధోరణి అవ లంబించారు. సాధారణంగా ఈ పోస్టును ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వం నియమించని పక్షంలో వర్సిటీలో డిప్యూటీ రిజిస్ర్టార్లుగా ఉన్న వారిలో సీనియర్‌కు ఈ బాధ్యతను అప్పగించాలి. గత నెల వరకు ఫైనాన్స్ ఆఫీసర్‌గా వ్యవహరించిన వనజారాణి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో వెళ్లిపోయారు. ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడంతో డిప్యూటీ రిజిస్ర్టార్లుగా పనిచేస్తున్న ఏడుగురిలో సీనియర్‌కు వర్సిటీ ఉన్నతాధికారులు ఆ బాధ్యతలను అప్పగించాలి. అయితే, అందుకు విరుద్ధంగా జాబితాలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న జూనియర్‌కు ఇచ్చారు. ప్రస్తుతం వైస్ చాన్సలర్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న వ్యక్తికే ఫైనాన్స్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. దీనిపై పలువురు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరో ఇద్దరికి పోస్టింగ్స్
ఇకపోతే, ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని కంప్యూటర్ సైన్స్ డిపార్టుమెంట్‌లో ఐదుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసు కునేందుకు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఆ మేరకు పోస్టు లను భర్తీచేశారు. వీరిలో ఒక ప్రొఫెసర్ విధుల్లో చేరగా, మిగిలిన నలుగురు ఇంకా చేరాల్సి ఉంది. కాగా, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేరిపోయారు. అయితే, నోటిఫికేషన్‌లో ప్రస్తావించకుండా మరో ఇద్దరిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకున్నారు. వీరిద్దరూ అదే డిపార్టుమెంట్‌లో పూర్తిస్థాయి (ఫుల్ టైమ్) పీహెచ్‌డీ చేస్తున్నారు. వీరికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశం కల్పించారు. అయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరాలంటే పార్ట్ టైమ్ కింద కన్వర్ట్ చేసు కోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేయిం చిన ఉన్నతాధికారులు వారికి మంచి వేతనాలతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలను కల్పించారు. కాంట్రాక్టు ప్రాతి పదికన విశ్వవిద్యాలయంలో పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకవేళ అత్యవసరమైతే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ పోస్టులను భర్తీ చేసినట్టు చెబుతున్నారు.
ఏయూ ఓఎస్‌డీగా ప్రొఫెసర్ కృష్ణమోహన్
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ నియమితులయ్యారు. రిజిస్ర్టార్‌గా గత నెలాఖరున ఆయన పదవీ విరమణ చేశారు. వైస్ చాన్సలర్‌కు అత్యంత సన్నిహితునిగా పేరొందిన కృష్ణమోహన్‌కు మూడు పర్యాయాలు రిజిస్ర్టార్‌గా అవకాశం లభించింది. కానీ, 65 ఏళ్లు పూర్తికావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్ర్టార్ పదవి నుంచి కృష్ణమోహన్ తప్పుకోవలసి వచ్చింది. అయితే తాను వీసీగా ఉన్నంత కాలం కృష్ణమోహన్ వర్సిటీలో ఉండేలా చూడాలని భావించిన ప్రసాదరెడ్డి...ఆయన్ను ఓఎస్‌డీగా నియమించారు. ఓఎస్‌డీగా కృష్ణమోహన్...వైస్ చాన్సలర్‌కు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. పేరుకు ఓఎస్‌డీ అయినప్పటికీ అనధికారిక రిజిస్ర్టార్‌గా కృష్ణమోహన్ వ్యవహరించే అవకాశముందన్న గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-10-07T01:18:48+05:30 IST