జగన్ పాలనలో ఏపీ అధోగతి
ABN, First Publish Date - 2023-06-26T01:19:24+05:30
పరిపాలనపై కనీస అవగాహన లేని జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలాల్లో సాగింది. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అయ్యన్న మాట్లాడుతూ, నాలుగేళ్లుగా రాష్ట్రానికి శని పట్టిందని, ఇది అన్ని వర్గాలను దోపిడీ చేస్తున్నదని, ఈ శనిని సాగనంపితేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని అన్నారు. సీఎం హోదాలో ఢిల్లీకి లెక్కలేనన్నిసార్లు వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించావని సీఎంను ప్రశ్నించారు. సుమారు 30 మంది ఎంపీలు వుండి విశాఖకు రైల్వే జోన్‌ను ఇంతవరకు సాధించలేదని దుయ్యబట్టారు.
శనిని సాగనంపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు
నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
వైసీపీ హయాంలో వ్యవసాయం నిర్వీర్యం
నాలుగు షుగర్ ఫ్యాక్టరీలను మూసేశారు
ఓటమి భయంతో ఓట్లు తీసేస్తున్నారు
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అయ్యన్నపాత్రుడు
చంద్రబాబుతోనే రైతు సంక్షేమం సాధ్యమని భరోసా
చోడవరం నియోజకవర్గంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ బస్సు యాత్ర
చోడవరం/ బుచ్చెయ్యపేట/ రావికమతం/ రోలుగుంట, జూన్ 25: పరిపాలనపై కనీస అవగాహన లేని జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలాల్లో సాగింది. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అయ్యన్న మాట్లాడుతూ, నాలుగేళ్లుగా రాష్ట్రానికి శని పట్టిందని, ఇది అన్ని వర్గాలను దోపిడీ చేస్తున్నదని, ఈ శనిని సాగనంపితేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని, ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని అన్నారు. సీఎం హోదాలో ఢిల్లీకి లెక్కలేనన్నిసార్లు వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించావని సీఎంను ప్రశ్నించారు. సుమారు 30 మంది ఎంపీలు వుండి విశాఖకు రైల్వే జోన్‌ను ఇంతవరకు సాధించలేదని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాష్ర్టానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఖ్యాతి పొందారని ఎద్దేవా చేశారు. జగన్ అసమర్థతను నిలదీసే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, వీటికి ఎవరూ భయపడేది లేదన్నారు. సంక్షేమ పింఛన్లను రూ.3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చి వృద్ధులు, వితంతువులను మోసం చేశావంటూ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించారు.
వ్యవసాయం నిర్వీర్యం
వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రైతు సంక్షేమం జరుగుతుందని అయ్యన్న అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడి, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని కోరారు.
వైసీపీ పాలనలో షుగర్ ఫ్యాక్టరీలు మూత
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ, భీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని అయ్యన్న అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేసిన గోవాడ ఫ్యాక్టరీ ఈ ఏడాది రెండు లక్షల టన్నులు కూడా క్రషింగ్ జరగలేదన్నారు.
ఓటమి భయంతో ఓట్లు తీసేస్తున్నారు
సీఎం జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓటర్ల జాబితాల నుంచి టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల పేర్లను మాయం చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఓటరు జాబితాలను తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారం కోసం సొంత బాబాయిని చంపించిన జగన్‌రెడ్డి, మరోసారి అధికారంలోకి రావడానికి కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా చంపించడానికి వెనుకాడరని విమర్శించారు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వున్న వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని, వైసీపీ పాలకులు పనులు కొనసాగించకుండా రైతులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
ధర్మశ్రీపై విమర్శల బాణాలు
సీఎం జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రజలను, అధికారులను దోచుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసు, రెవెన్యూ, రిజిస్ర్టేషన్... తదితర శాఖ అధికారుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే టన్ను చెరకు రూ.3,500 చెల్లిస్తామని చెప్పి ఎమ్మెల్యే అయిన కరణం ధర్మశ్రీ.. హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని అయన్న ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రధాన రహదారి బీఎన్ రోడ్డును అభివృద్ధి చేయలేని చేతకాని ఎమ్మెల్యే అని విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.4.5 కోట్లతో చేపట్టిన ఎల్‌బీబీ అగ్రహారం ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, వైసీపీ నాయకులు హైకోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తానని రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని ధర్మశ్రీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా బస్సు యాత్రంలో భాగంగా బుచ్చెయ్యపేట మండలం ఎల్‌బీబీ అగ్రహారం ఎత్తిపోతల పథకం, చోడవరం ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పఽథకం శిలాఫలకం వద్ద సెల్ఫీ చాలెంజ్ నిర్వహించారు. బస్సు యాత్ర ఆదివారం రాత్రి చోడవరం మండలం గజపతినగరం గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమంలో నేతలు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు, చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, పీలా గోవింద సత్యనారాయణ, ఎలమంచిలి ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాడుగుల ఇన్‌చార్జి పీవీజీ కుమార్, నాయకులు పైలా ప్రసాదరావు, గూనూరు మల్లునాయుడు, ఆయా మండలాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T01:19:24+05:30 IST