మళ్లీ గోతుల కష్టాలు
ABN, First Publish Date - 2023-05-02T01:43:33+05:30
చోడవరం పట్టణం మీదుగా వెళ్లే భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు సోమవారం కురిసిన వర్షంతో మరింత అధ్వానంగా మారింది.
వర్షంతో దారుణంగా తయారైన బీఎన్ రోడ్డు
మూన్నాళ్ల ముచ్చటగా మారిన మరమ్మతు పనులు
నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్న గోతులు
వాహనదారులు నానాపాట్లు
రోడ్డు అభివృద్ధిపై ఏడాది నుంచి ప్రకటనలతో మభ్యపెడుతున్న అధికార పార్టీ నేతలు
చోడవరం, మే 1:
చోడవరం పట్టణం మీదుగా వెళ్లే భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు సోమవారం కురిసిన వర్షంతో మరింత అధ్వానంగా మారింది. రహదారి అభివృద్ధి పనుల సంగతి అటుంచి కనీసం గోతులు అయినా పూడ్చకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. గోతుల్లో నుంచి కార్లు, బస్సులు, లారీలు వెళ్లేటప్పుడు వర్షపు నీరు రోడ్డు ఇరువైపులకు పరవళ్లు తొక్కుతున్నది. పక్క నుంచి వెళ్లే వారిపై బురద నీరు చిందుతున్నది. అంతేకాక గోతుల్లో నుంచి రాళ్లు లేచిపోయి గోతులు మరింత పెద్దవిగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
చోడవరం నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్ రోడ్డు అభివృద్ధి పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులు రూ.113 కోట్లతో చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఇదిగో మొదలవుతాయి... అదిగో ప్రారంభం అవుతాయి అంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఏడాది నుంచి హడావిడి చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వుంది. చోడవరం నుంచి రోలుగుంట వరకు రోడ్డు మొత్తం గోతులమయంగా మారడంతో వాహనాలు తిరగలేని పరిస్థితి. అభివృద్ధి పనులు ఎటూ చేయడంలేదు.. కనీసం గోతులైనా కప్పించాలని స్థానికులు, వాహనదారులు పలుమార్లు విజ్ఞప్తి చేయగా, రెండు నెలల క్రితం అక్కడకక్కడా గోతులు కప్పి మమ అనిపించారు. ఈ నేపథ్యంలో ‘‘బీఎన్ రోడ్డు పనులు రెండు రోజుల్లో చేపట్టి మే నెలాఖరుకల్లా పూర్తి చేసితీరుతామం’’ అంటూ కరణం ధర్మశ్రీ వారం రోజుల క్రితం ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో కలిసి ప్రకటించారు. అయినా సరే ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కురిసిన వర్షంతో రోడ్డు దుస్థితి మరింత దయనీయంగా మారింది. రెండు నెలల క్రితం మొక్కుబడిగా కప్పిన గుంతలు.. ఈ వర్షంతో మళ్లీ బయటపడ్డాయి. చోడవరం పట్టణంలో రహదారి మొత్తం పంట కుంటలను తలపిస్తున్నది. ప్రధానంగా చోడవరం శివారు లోని అటవీశాఖ కార్యాలయం సమీపంలో, కొత్తూరు జంక్షన్ సమీపంలోని శివాలయం ఆర్చి వద్ద, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డు మొత్తం గోతులమయంగా మారింది. బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట, రావికమతం మండలాల్లో పరిస్థితిలో కూడా ఇదే తరహాలో వుంది.
ప్రకటనలతో కాలక్షేపం
బీఎన్ రోడ్డు అభివృద్ధి పనులపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు, హడావిడి అంతా ఓ తంతుగా మారిందన్న విమర్శలు స్థానికులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. అధికారులతో సమీక్షలు, ఆర్భాటపు ప్రకటనలు తప్ప... రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేయించడంలో చిత్తశుద్ధి కొరవడిందని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సుమారు మూడు నెలల క్రితం చోడవరం పర్యటనకు వచ్చినప్పుడు బీఎన్ రోడ్డు దుస్థితిని సొంత పార్టీ నాయకులే ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వారంలోగా రోడ్డు పనులు ప్రారంభింపజేస్తామని ఆయన ప్రకటించారు. మూడు నెలలు అయినా పనులు మొదలు కాలేదు. గత నెల 7న ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు చోడవ రం నుంచి రోలుగుంట వరకు రోడ్డును పరిశీలించి పనులు వెంటనే ప్రారంభించేలా చూస్తామని ప్రకటించారు. అయినా మార్పు లేదు. ఇదే రోడ్డుపై ఆదివారం వైవీ సుబ్డారెడ్డితో కలిసి అధికార పార్టీ నేతలు రోడ్‌షో నిర్వహించారు. ఈసారి రోడ్డు అభివృద్ధి గురించి పెదవి విప్పలేదు!
Updated Date - 2023-05-02T01:43:33+05:30 IST