పేరుకుపోయిన చెత్త కుప్పలు
ABN, First Publish Date - 2023-05-30T01:23:29+05:30
నగరంలో మళ్లీ చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పారిశుధ్య కార్మికులకు ఆదివారం వారాంతపు సెలవు కాగా, సోమవారం టోకెన్ సమ్మె పేరుతో విధులను బహిష్కరించారు.
నగరంలో రెండు రోజులుగా నిలిచిపోయిన చెత్త సేకరణ, తరలింపు
కార్మికులకు ఆదివారం సెలవు కాగా...సోమవారం సమ్మె
విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మళ్లీ చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పారిశుధ్య కార్మికులకు ఆదివారం వారాంతపు సెలవు కాగా, సోమవారం టోకెన్ సమ్మె పేరుతో విధులను బహిష్కరించారు. వరుసగా రెండు రోజులపాటు చెత్త సేకరణ, తరలింపు జరగకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరవాసులు తమ ఇళ్లలో చెత్తను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. గత రెండు రోజులుగా చెత్తను తరలించకపోవడంతో మద్దిలపాలెం, శివాజీపాలెం, పిఠాపురం కాలనీ, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, అక్కయ్యపాలెం, రామచంద్రనగర్, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. వీటిని కుక్కలు, పందులు, పశువులు చిందరవందర చేయడం, ఆదివారం కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో చెత్త నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సోమవారం ఉదయం పలు ప్రాంతాలను సందర్శించారు. నగరంలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా శాశ్వత కార్మికులతో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలించాలని ఆదేశించారు. అయితే కొన్ని ప్రాంతాల్లోనే చెత్తను పాక్షికంగా తరలించగలిగారు. మిగిలిన చెత్తను అలాగే వదిలేశారు. ఈ విషయం ప్రజారోగ్య విభాగం అధికారుల వద్ద ప్రస్తావించగా ఆదివారం కార్మికులకు సెలవు కావడంతో సోమవారం ఉదయానికి సాధారణంగానే చెత్త ఎక్కువగా పోగవుతుందన్నారు. మంగళవారం ఉదయానికి వీధుల్లోని చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డులకు తరలించేస్తామని సమాధానమిచ్చారు.
Updated Date - 2023-05-30T01:23:29+05:30 IST