రితీ సాహ కేసులో మలుపు
ABN, First Publish Date - 2023-09-02T01:24:11+05:30
పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రితీ సాహ మృతి కేసు మలుపు తిరిగింది.
నిర్వహణపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆకాశ్-బైజూస్ అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్), కళాశాల బ్రాంచి మేనేజర్, హాస్టల్ వార్డెన్, భవన యజమాని అరెస్టు
ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వారం కిందట విశాఖ పోలీసులు ప్రకటన
బెంగాల్ సీఐడీ రంగంలోకి దిగడంతో మారిన సీన్
సెక్షన్ల మార్పు...
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రితీ సాహ మృతి కేసు మలుపు తిరిగింది. ‘బైజూస్-ఆకాశ్’ ఆధ్వర్యంలో నడిచే నరసింహనగర్‌లోని అచీవర్స్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రితీ సాహ...సదరు యాజమాన్యం నిర్వహించే దొండపర్తిలోని సాధన హాస్టల్‌లో ఉంటోంది. జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 17న మృతిచెందింది. ఆమెది ఆత్యహత్య అని, అందులో అనుమానించడానికి ఏమీ లేదని వారం క్రితం విలేకరుల సమావేశంలో వెల్లడించిన విశాఖ సిటీ పోలీసులు ఇప్పుడూ అదే మాట చెబుతున్నారు. అయితే హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం దీనికి కారణమని పేర్కొంటూ కాలేజీకి చెందిన ఇద్దరిని, హాస్టల్‌కు చెందిన మరో ఇద్దరిని మొత్తం నలుగురిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
ఈ కేసులో ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. రితీ సాహ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడడంతో మృతిచెందినట్టు పేర్కొంటూ ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతికి బైజూస్-ఆకాశ్ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఆమె తండ్రి సుఖదేవ్ సాహా పశ్చిమ బెంగాల్‌లో పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నేతల ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి తమ కుమార్తె మృతి విషయంలో విశాఖ పోలీసులు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. సీఎం ఆదేశాల మేరకు కోల్‌కతాలోని నేతాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు ఇక్కడికి వచ్చి మూడు రోజులు దర్యాప్తు చేశారు. అమ్మాయి చదువుతున్న కాలేజీ, ఉంటున్న హాస్టల్, పైనుంచి కింద పడిపోయిన తరువాత చికిత్స అందించిన ఆస్పత్రులకు వెళ్లి విచారించారు. నివేదిక తయారుచేశారు. కాగా...విశాఖ సిటీ పోలీసులు ముందు ఈ కేసు ఆత్మహత్యగానే నమోదు చేశారు. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ సీఐడీ బృందం రంగం ప్రవేశం చేసిందో అప్పుడు హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతాపరమైన లోపాలే కారణమంటూ గతంలో నమోదుచేసిన సెక్షన్‌ను 304 పార్ట్-11 (ఆత్మహత్యకు అవకాశం కల్పించడం)కు మార్చారు. అలాగే సీఐ సారథ్యంలో దర్యాప్తు జరుగుతున్న కేసును ఏసీపీకి అప్పగించారు. నేరపూరిత నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ మరణం సంభవించిందంటూ శుక్రవారం సాధన హాస్టల్ వార్డెన్ గన్ను కుమారి, సాధన హాస్టల్ నడుస్తున్న భవన యజమాని ఎచ్చెర్ల సూర్యకుమారి, ఆకాశ్-బైజూస్ అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్) గంగుమల్ల నాగ వెంకటదుర్గారవికాంత్, ఆకాశ్-బైజూస్ బ్రాంచి మేనేజర్ గుండు రాజేశ్వరరావును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మూర్తి ఒక ప్రకటన విడుదల చేస్తూ సీసీ టీవీ ఫుటేజీ అంతా పరిశీలించిన తరువాతే ఆత్మహత్యగా నిర్ధారించుకున్నామన్నారు. ఇందులో ఎటువంటి ‘ఫౌల్ ప్లే’ (దొంగాట) లేదని పేర్కొన్నారు. ఆ ఆధారాలన్నీ సంబంధిత నిపుణులకు పంపించామన్నారు.
హైకోర్టులో తండ్రి కేసు
ఇదిలావుండగా రితీ సాహ తండ్రి సుఖదేశ్ ఈ అంశంపై ఏపీ హైకోర్టులో కేసు వేశారు. తనకు సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పించాలని కోర్టు ద్వారా కోరారు. తన కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున సీసీ టీవీ ఫుటేజీ కావాలని కోరారు. దీంతో హైకోర్టు అడ్వకేట్ కమిషనర్‌ని నియమించింది. వారు వచ్చి ఇక్కడి ఆధారాలను సేకరించి హైకోర్టుకు ఆగస్టు 28నే అందజేశారు. ఈ కేసులో విశాఖ సీపీ, ఫోర్త్ టౌన్ పోలీసులు, సాధన హాస్టల్, వెంకటరామ ఆస్పత్రి, కేర్ ఆస్పత్రులను ప్రతివాదులుగా చూపించారు.
సిటీ పోలీసులకు తలవంపులు
విశాఖపట్నం సిటీ పోలీసులకు ఈ కేసు తలవంపులు తెచ్చి పెట్టింది. ముందు సాధారణ ఆత్మహత్య కేసు అంటూ స్వయంగా సీపీ త్రివిక్రమవర్మే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ రావడంతో ఆగమేఘాలపై సెక్షన్లు మార్చారు. దర్యాప్తును ఉన్నత స్థాయి అధికారికి అప్పగించారు. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోర్త్ టౌన్ సీఐ శ్రీనివాసరావును బదిలీ చేశారు. తాజాగా విద్యా సంస్థల నిర్లక్ష్యం అంటూ కాలేజీ, హాస్టల్, భవన యజమానిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
భవన యజమానిని అరెస్టు చేయడం ఇదే ప్రథమం
ఒక కాలేజీ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి పడి మరణించిన కేసులో కాలేజీ నిర్వాహకులు, హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానులను నిర్లక్ష్యం పేరుతో అరెస్టు చేయడం విశాఖపట్నంలో ఇదే తొలిసారి. ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్న తరువాత దానిని ఉపయోగించుకునేవారు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు. ఇక్కడ హాస్టల్ కోసం భవనం తీసుకున్నారు కాబట్టి టెర్రస్‌పైకి ఎవరూ రాత్రివేళ వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులది. కేసులో అరెస్టులు చూపించకపోతే పరువు పోతుందని, అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల పైకి వస్తుందని...కళాశాల నిర్వాహకులను, భవన యజమానిని కూడా నిందితులుగా చూపించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇంకా బయట పడాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
తండ్రి ఆరోపణలు
ఈ కేసులో విద్యార్థిని తండ్రి సుఖదేవ్ సాహా తీవ్ర ఆరోపణలు చేశారు. మేడ మీద సీసీ టీవీ ఫుటేజీలో ఉన్న అమ్మాయి తన కుమార్తె కాదని విజయవాడలో శుక్రవారం ఆరోపించారు. ఎవరో బలమైన వ్యక్తి తోస్తే తప్ప మేడ పైనుంచి పడే అవకాశం లేదన్నారు. దీనిపై హాస్టల్ సిబ్బందితో మాట్లాడితే, టెర్రస్ పైనుంచి పడిందని ఒకరు, మెట్ల పైనుంచి పడిందని మరొకరు చెప్పారని, అమ్మాయి శరీరంపై గాయాలు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు.
Updated Date - 2023-09-02T01:24:11+05:30 IST