గూడు లేని బడి!
ABN, First Publish Date - 2023-06-07T00:58:16+05:30
పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో పిల్లలు చదువు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని మండలంలోని బూదరాళ్ల పంచాయతీ దూరపాలెం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న దూరపాలెంలో 20 గిరిజన కుటుంబాలు నివాసం వుంటున్నాయి. గ్రామంలో ప్రస్తుతం సుమారు 20 మంది బడి ఈడు పిల్లలు వున్నారు.
దూరపాలెంలో పక్కా భవనం నిర్మించని అధికారులు
పిల్లల కోసం శ్రమదానంతో పాక నిర్మించుకున్న గిరిజనులు
వర్షం పడితే పాఠశాలకు సెలవు
కనీసం రేకుల షెడ్డు అయినా నిర్మించాలని గ్రామస్థులు వినతి
కొయ్యూరు, జూన్ 6: పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో పిల్లలు చదువు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని మండలంలోని బూదరాళ్ల పంచాయతీ దూరపాలెం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న దూరపాలెంలో 20 గిరిజన కుటుంబాలు నివాసం వుంటున్నాయి. గ్రామంలో ప్రస్తుతం సుమారు 20 మంది బడి ఈడు పిల్లలు వున్నారు. గ్రామంలో పాథమిక పాఠశాల ఏర్పాటు చేసి, టీచర్‌ను నియమించిన అధికారులు.. భనవం నిర్మించలేదు. దీంతో గ్రామస్థులు శ్రమదానంతో చిన్నపాటి పాక నిర్మించారు. అయితే వర్షం పడితే ఆ రోజు పాఠశాలకు సెలవే! పక్కా భవనం నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకపోయింది. గతంలో వేసిన పాక సైతం పూర్తిగా పాడైపోయింది. దీనిలో పాఠశాల నిర్వహించడం కష్టమని మరోసారి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండంతో గ్రామస్థులే చొరవ తీసుకుని కర్రలు, షేడ్ నెట్‌లతో పాక నిర్మించుకున్నారు. అయితే వర్షం పడితే నీరు కారుతుందని, గాలి వీస్తే పాక కూలిపోతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రేకుల షెడ్డు అయినా నిర్మించాలని దూరపాలెం గిరిజనులు కోరుతున్నారు.
ఈ విషయాన్ని ఎంఈవో బోడంనాయుడు దృష్టికి తీసుకెళ్లగా... మండలంలో వసతి సదుపాయం లేని 10 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దూరపాలెం పాఠశాల వసతి సమస్య విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దృష్టికి తీసుకువెళ్లి, తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - 2023-06-07T00:58:16+05:30 IST