మహా ఉల్లంఘన
ABN, First Publish Date - 2023-02-21T01:09:42+05:30
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి భర్త శ్రీనివాసరావు ప్లాన్‌కు విరుద్ధంగా భవనం నిర్మించారని, అది కూడా అడ్డగోలుగా రెసిడెన్షియల్‌కు అప్రూవల్ తీసుకుని తీసుకుని ఫంక్షన్‌హాల్ ఏర్పాటుచేశారంటూ జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ సోమవారం జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు.
రెసిడెన్షియల్ జోన్‌లో కమర్షియల్ బిల్డింగ్
మేయర్ భర్త శ్రీనివాసరావు ఇష్టారాజ్యం
ప్లాన్‌కు విరుద్ధంగా భవన నిర్మాణం
ఫంక్షన్‌హాల్ ప్రారంభం
చోద్యం చూస్తున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు
కమిషనర్‌కు ‘స్పందన’లో ఫిర్యాదుచేసిన జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్
ఆధారాలు అందజేత
అధికారులు స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తానని ప్రకటన
విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి భర్త శ్రీనివాసరావు ప్లాన్‌కు విరుద్ధంగా భవనం నిర్మించారని, అది కూడా అడ్డగోలుగా రెసిడెన్షియల్‌కు అప్రూవల్ తీసుకుని తీసుకుని ఫంక్షన్‌హాల్ ఏర్పాటుచేశారంటూ జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ సోమవారం జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను ‘స్పందన’లో సమర్పించారు. జనసేన కార్పొరేటర్ తన ఫిర్యాదులో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి...
జోన్-3 పరిధిలో ఇసుకతోటలో జాతీయ రహదారికి సమీపాన 130 చదరపు మీటర్ల స్థలంలో స్టిల్ట్+జీ+2 భవన నిర్మాణం కోసం గొలగాని శ్రీనివాసరావు, గొలగాని ఉమామహేశ్వరరావుల పేరుతో జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు అందింది. వీరి దరఖాస్తును పరిశీలించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు సదరు స్థలం రెసిడెన్షియల్ జోన్‌లో వున్నందున స్టిల్ట్+జీ+2 భవనాన్ని నివాసానికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తూ ఒక్కో ఫ్లోర్‌లో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు చొప్పున మూడు అంతస్థుల్లో మూడు ఇళ్లను మాత్రమే నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తూ ప్లాన్ మంజూరుచేశారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే గొలగాని శ్రీనివాసరావు భార్య హరివెంకటకుమారి మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో భవనాన్ని శ్రీనివాసరావు నివాస అవసరాలకు కాకుండా, వాణిజ్య అవసరాలకు వినియోగించేలా నిర్మించారు. సెట్‌బ్యాక్‌లు కూడా వదలకుండా నిర్మాణం పూర్తిచేశారు. ప్లాన్ ప్రకారం కాకుండా టెర్రస్‌పై కొంతభాగంలో గదులను నిర్మించారు. పూర్తిగా రెసిడెన్షియల్ జోన్‌గా వున్న ప్రాంతంలో వాణిజ్య అవసరాలకు భవన నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అందుకే అసలు అధికారులు ప్లాన్ జారీచేయరు. ఒకవేళ ఎవరైనా రెసిడెన్షియల్‌కు ప్లాన్ తీసుకుని కమర్షియల్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే టౌన్‌ప్లానింగ్ అధికారులు వెంటనే కూల్చేస్తారు. కానీ మేయర్ భర్తకు చెందిన భవనం కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. భవన నిర్మాణం పూర్తవ్వడంతో ఇటీవలే ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించేసి, వేడుకలకు అద్దెకు ఇచ్చేస్తున్నారు. అక్కడ జరిగే వేడుకలకు హాజరయ్యే వారంతా తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపేస్తుండడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా అంతపెద్ద భవనానికి ఆస్తి పన్ను కింద అర్ధ సంవత్సరానికి కేవలం రూ.1,311 మాత్రమే విధించి తమ భక్తిని చాటుకున్నారు. అదే ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని ఫంక్షన్‌హాల్ ఏర్పాటుచేసినందున ‘అపూర్వ ఫంక్షన్ హాల్’ను సీజ్ చేసిన రెవెన్యూ విభాగం అధికారులు...పక్కనే వున్న మేయర్‌కు చెందిన ఫంక్షన్ హాల్ (వసుదేవ ఫంక్షన్‌హాల్)ను వదిలేయడం దారుణమని కార్పొరేటర్ మూర్తియాదవ్ అన్నారు. ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై పక్కా ఆధారాలను అందజేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
Updated Date - 2023-02-21T01:09:43+05:30 IST