మన్యంపై మంచు దుప్పటి
ABN, First Publish Date - 2023-01-18T00:24:54+05:30
మన్యంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం పాడేరులో ఉదయం పదకొండు గంటల వరకు పొగ మంచుకమ్ముకోగా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పదిన్నర గంటల వరకు పొగ మంచు దట్టంగా కురిసింది.
ఉదయం 11 గంటల వరకు వీడని మంచు తెరలు
పాడేరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం పాడేరులో ఉదయం పదకొండు గంటల వరకు పొగ మంచుకమ్ముకోగా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పదిన్నర గంటల వరకు పొగ మంచు దట్టంగా కురిసింది. దీంతో పదకొండు గంటల తరువాత గాని సూర్యకిరణాలు కనిపించలేదు. అలాగే గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. రోజూ ఉదయం పదకొండు గంటల వరకు పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
చింతపల్లిలో..
చింతపల్లి: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికి చలి తీవ్రత అధికంగా ఉంది. మంచు దట్టంగా కురుస్తున్నది. అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత చిరు జల్లును పోలినట్టుగా మంచు పడుతోంది. ఉదయం పదకొండు గంటల వరకు గిరిజన గ్రామాలను మంచు దుప్పటి కప్పి ఉంటోంది. మంచు వల్ల రెండు మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు, వస్తువులు సైతం స్పష్టంగా కనిపించడం లేదు. ఈ కారణంగా ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. జనం కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. వణించే చలిలోనే ప్రజలు వారి రోజువారీ పనులు చేసుకుంటున్నారు. కాగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో లంబసింగి, చింతపల్లి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో మంచు తీవ్రత అధికంగా ఉంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు మండల కేంద్రంలో మంచు తెరలు వీడలేదు. ఆ తరువాత సూర్యుడు వచ్చినా చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. సాయంత్రం నాలుగు గంటలు దాటితే చాలు చలి మొదలవుతోంది. చలికి వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.
Updated Date - 2023-01-18T00:24:58+05:30 IST