ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Teacher Torture: టీచరుకు టార్చర్‌!

ABN, First Publish Date - 2023-03-05T02:13:41+05:30

టీచర్‌ అంటే ఏం పని ఉంటుంది! సరదాగా వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఓ ముద్ర ఉండేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

క్లాస్‌రూమ్‌ టు బాత్రూమ్‌.. టెన్షన్‌ టెన్షన్‌..

ప్రాణాలు తీస్తున్న బోధనేతర భారం

నాలుగు రోజుల్లోనే నలుగురు మృత్యువాత

ఒకప్పుడు పాఠం చెప్పడమే బాధ్యత

ఇప్పుడు ఒక్కొక్కరిపై 30 బాధ్యతలు

నామమాత్రంగా మారిన బడి, బోధన పని

యాప్‌లు, ఫొటోలు, ట్యాబ్‌లతో సతమతం

ముఖ హాజరు కంగారులో ప్రాణాలపైకి..

ఇంటికొచ్చినా తీరిక ఇవ్వని వర్క్‌లోడ్‌

కుటుంబాలతో గడపలేని దుస్థితి

పర్యటనలతో ఉన్నతాధికారుల హడావుడి

చిన్న లోపమున్నా చీవాట్లు, నోటీసులు

ఫలితంగా ధైర్యం కోల్పోతున్న గురువులు

వారిలో పెరిగిపోతున్న హృద్రోగ సమస్యలు

ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం

పాఠం చెబుతూ గుండెపోటుకు గురై క్లాస్‌రూమ్‌లోనే మరణించిన టీచరు! ముఖహాజరు వేయాలనే తొందరలో బండి నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన ఉపాధ్యాయిని! రైలు కింద పడి ఒకరు, ఆత్మహత్య చేసుకుని మరొకరు..

ఇలా ఈ నెలలో 4 రోజుల్లోనే నలుగురు టీచర్లు మరణించారు. పరుగులు పెట్టిస్తున్న పనులఒత్తిడితో ఇంకొకరు ఆస్పత్రి పాలయ్యారు. భావితరాలను తీర్చిదిద్దే గురువులకు గుండెపోటు రావడం ఏమిటి? ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏమొచ్చింది? శనివారం అన్ని ఉపాధ్యాయ గ్రూపుల్లోనూ దాదాపు ఇదే టాపిక్‌! అందరికీ ఒకటే టార్చర్‌!

ఒకప్పుడు పాఠం చెప్పడమే బాధ్యత! ఇప్పుడు ఒక్కొక్క టీచరుపై 30 బాధ్యతలు! రోజుకు ఆరు పీరియడ్ల బోధనతోపాటు.. యాప్‌లో, హాజరుపట్టీలో పిల్లల హాజరు నమోదు.. మధ్యాహ్నభోజనం చేసిన పిల్లల నమోదు, వారి ఫొటోలు.. సరుకుల వివరాలు అప్‌లోడ్‌.. మరుగుదొడ్ల వివరాలు అప్‌లోడ్‌.. విద్యార్థులు యూనిఫాం వేసుకున్నారా? వేసుకుంటే బూట్లున్నాయా లేదా...బూట్లు ఉంటే బెల్టు పెట్టుకున్నారా లేదా వంటి సూక్ష్మస్థాయి పరిశీలన.. వర్క్‌బుక్స్‌ దిద్దడం.. ఎఫ్‌ఏ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం... నాడు-నేడు పనులు రోజువారీగా ఫొటోలు తీసి అప్‌లోడ్‌.. కొత్తగా బైజూస్‌ ట్యాబ్‌ల పర్యవేక్షణ తదితరాలు...

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) / గుంటూరు (విద్య): టీచర్‌ అంటే ఏం పని ఉంటుంది! సరదాగా వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఓ ముద్ర ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కేవలం బోధన పనులకే పరిమితమైనంత కాలం టీచర్లు ప్రశాంత వాతావరణాన్నే గడిపారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక టీచర్‌ అంటే ఇన్ని పనులుంటాయా? అనే పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు వైవిధ్యంగా ఎలా బోధించాలనే కొత్త ఆలోచనలకు స్వస్తి పలికి ఈరోజుకు పనులన్నీ పూర్తిచేసుకున్నామా? లేదా? అని ప్రైవేటు ఉద్యోగుల తరహాలో గడియారం చూసుకునే దుస్థితి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం టీచర్లపై బోధనేతర పనుల భారం. ఉదయం బడికి వచ్చిన వెంటనే బాత్‌రూమ్‌ ఫొటోలు మొదలు హాజరు, మధ్యాహ్న భోజనం, వాటి సరుకుల దిగుమతులు, నాడు-నేడు ఫొటోలు...ఇలా అనేక బోధనేతర పనులు టీచర్లను ముప్పతిప్పలు పెడుతున్నాయి. దీంతో బోధనకు సంబంఽధించిన పనులకు సమయం కుంచించుకుపోతోంది.

ఉరుకులు పరుగులు

టీచర్లు సక్రమంగా బడులకు రావట్లేదన్న ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం ఫోన్‌ద్వారా ముఖహాజరు నమోదుచేసే విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఏది ఏమైనా ఉదయం 9గంటలకల్లా టీచర్లు బడిలో ఉండాలి. వాస్తవానికి ముఖహాజరు లేకపోయినా ఆ సమయానికే బడిలో ఉంటారు. కాకపోతే ఏదైనా ఒకరోజు వర్షం, ట్రాఫిక్‌, ఇతరత్రా అనుకోని కారణాలతో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడేమో ఉదయాన్నే ఉరుకుల పరుగులతో టీచర్లు బడులకు వెళ్తున్నారు. ముఖహాజరు అమల్లోకి వచ్చాక చాలా మంది మహిళా టీచర్లు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలపై బడికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

చర్యలే చర్యలు...

ఇటీవలకాలంలో టీచర్లపై మరింత ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పి సిలబస్‌ పూర్తిచేయడంతోనే టీచరు బాధ్యత తీరిపోవడం లేదు. పిల్లలు సక్రమంగా వర్క్‌బుక్‌లు రాశారా? వాటిలో తప్పులున్నాయా? అనేది కూడా టీచరు చూడాలి. ప్రతిరోజూ పిల్లలకు ఏం పాఠం చెప్పబోతున్నారనేది ముందుగానే పాఠ్యప్రణాళిక రాసుకోవాలి. పరీక్షలు ముగిసిన వెంటనే పేపర్లు దిద్ది పిల్లలకు ఇవ్వాలి. అవకాశం ఉంటే పిల్లలతో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలి. సకాలంలో విద్యా కానుక కిట్లు పంపిణీ పూర్తిచేయాలి. పిల్లలంతా వాటిని వినియోగిస్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించాలి. ఇలా తలకు మించిన భారాన్ని టీచర్ల నెత్తిన పెడుతున్నారు. వీటిలో ఏ ఒక్క లోపం కనిపించినా ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశిస్తున్నారు. దీంతో ఏ రోజు తమపై వేటు పడుతుందోనని టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు.

కుటుంబానికి సమయమేదీ?

రేషనలైజేషన్‌ పేరుతో టీచర్లపై పనిభారం పెంచారు. రోజులో ఆరుకు తగ్గకుండా పీరియడ్లు బోధించాలి. దీంతో పాఠ్య ప్రణాళికలు రాసుకోవడం, పేపర్లు దిద్దడానికి బడిలో తీరిక ఉండటం లేదు. దీంతో చాలా మంది ఆ పనులు ఇంటి వద్ద చేస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు హోంవర్క్‌ ఉన్నా లేకపోయినా టీచర్లకు మాత్రం ఉంటోంది. దీంతో కుటుంబాలతో గడిపే సమయం కూడా దొరకట్లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు కొత్తగా బైజూస్‌ ట్యాబ్‌ల భారం మోపారు. ప్రతిరోజూ వాటిని చూడాలనే కండీషన్‌ పెట్టారు.

బిక్కుబిక్కుమంటూ...

దాదాపు 30 రకాల బాధ్యతలు టీచర్లపై ఉన్నాయి. ఇటీవల ఉన్నతాధికారుల తనిఖీల్లో వాటిలో ఏవైనా లోపాలుంటే షోకాజు నోటీసులు జారీచేస్తున్నారు. కొందరైతే సస్పెన్షన్లకు గురౌతున్నారు. దీంతో బడికి వెళ్లాక ఎవరు తనిఖీలు చేస్తారో? ఏ లోపాలు పట్టుకుంటారో? అనే భయం! ‘మా పాఠశాలలో 90శాతం పనులన్నీ సమయానికి పూర్తిచేస్తున్నాం. అయినా ఎక్కడో ఒకచోట చిన్నపాటి లోపాలుంటాయి. కానీ ఉన్నతాధికారుల పర్యటనలంటేనే వణికిపోయే పరిస్థితి వస్తోంది. ఏది పట్టుకుని నిలదీస్తారోననే భయం టీచర్లలో ఉంది’ అని ఓ ఉన్నత పాఠశాల టీచర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

కుప్పకూలిపోతున్నారు...

బాపట్ల జిల్లాలో పిల్లలకు పాఠాలు చెబుతూ టీచర్‌ తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుకు గురైన ఆయన కొద్దిసేపట్లోనే తుది శ్వాస విడిచాడు. బడికి తొందరగా చేరుకుని ముఖహాజరు వేయాలనే కంగారులో స్కూటీ నడుపుతూ...పల్నాడు జిల్లాలో ఓ మహిళా టీచర్‌ ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. అదే జిల్లా గురజాలలో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. నెల రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో నాడు- నేడు పనిఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రధానోపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2023-03-05T09:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising