ఊళ్లలోకి వస్తున్నాయ్!
ABN, First Publish Date - 2023-07-21T00:17:04+05:30
జిల్లాలో ఓ పక్క అడవులు అంతరించిపోతున్నాయి. మరోపక్క కొండలు తరిగిపోతున్నాయి. దీంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
జనావాసంలోకి వన్యప్రాణులు
దాడిచేసి గాయపరుస్తున్న వైనం
పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన
(టెక్కలి)
- ఈ నెల 15న మందస మండలం లోహరిబంద, యశోదనగర్ గ్రామాల సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. రోడ్డుపై చుట్టూ తిరుగుతూ.. బిగ్గరగా అరుస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీశాఖాధికారులకు సమాచారం అందజేయగా.. వారు వచ్చి దానిని బంధించి విశాఖపట్నంలోని ‘జూ’కు తరలించారు.
- అదే రోజు పలాస మండలం కోసంగిపురం రోడ్డు జగనన్న కాలనీ వద్ద కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. మెండు జీడిఫారెస్ట్ నుంచి జింకల గుంపు నీటి కోసం కాలనీ సమీపంలోకి రాగా కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో ఒక జింక నీటితొట్టెలో పడి గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
- గతేడాది జూన్ 20న వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి, వజ్రపుకొత్తూరు గ్రామాల మధ్య కొబ్బరితోటల్లో పనిచేసుకుంటున్న వారిపై ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఆరుగురిపై దాడిచేసింది. అందులో ఒకరు మృతి చెందారు.
- 2018 జూన్ 11న సోంపేట మండలం ఎర్రముక్కాం, మందస మండలం దున్నూరు పరిసరాల్లో ఎలుగుబంటి మారణకాండ సృష్టించింది. తోటలో ఉన్న దంపతులిద్దరిపై దాడిచేసి చంపేసింది. మరో ఏడుగురిని గాయపరచింది.
- కొద్ది నెలలుగా సోంపేట, మందస మండలాల్లో ఒక అడవి పిల్లి సంచరిస్తోంది. తోటలు, పొలాల్లో కట్టిన పశువులపై దాడి చేస్తోంది. పదుల సంఖ్యలో లేగదూడలను చంపేసింది.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలను దెబ్బతీస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం లఖేరి ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
...................
జిల్లాలో ఓ పక్క అడవులు అంతరించిపోతున్నాయి. మరోపక్క కొండలు తరిగిపోతున్నాయి. దీంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా పాతపట్నం, టెక్కలిలో చుక్కల దుప్పిలు, జింకలు నీటి కోసం జనావాసాల మధ్యకు వస్తున్నాయి. కుక్కల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. అలాగే ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు మనుషులపై దాడి చేస్తున్నాయి. హుద్‌హుద్, తితలీ.. ఇలా వరుస తుఫాన్‌లు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఉద్దానం, మైదానం ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరి, జీడిమామిడి తోటలు ధ్వంసమయ్యాయి. టెక్కలి డివిజన్‌లో మొగలి డొంకలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో ఎలుగుబంట్లు, అడవిపందులు, ఇతర వన్యప్రాణులు తలదాచుకునేందుకు మార్గాలు లేక గ్రామాల్లోకి వస్తున్నాయి. మనుషులు తమకు ఎక్కడ హాని తలపెడతారోనని ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది మనుషుల ప్రాణాలు పోతున్నాయి.
- జిల్లాలో 44,57,495 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, కాశీబుగ్గ అటవీ రేంజ్‌లు ఉన్నాయి. 18 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్‌లు, 31 ఫారెస్ట్ బీట్స్ ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ అటవీ అధికారుల బాధ్యత. కానీ ఆ శాఖ నిద్దరోతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారు. సోంపేట, మందస మండలాల్లో అడవి పిల్లి దాడిలో లేగదూడలు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత రైతులు చెబుతున్నారు. చుక్కల దుప్పిలు, జింకల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అసలు జిల్లాలో అరుదైన పక్షులు, జంతువులు ఎన్ని ఉన్నాయో గణన చేయలేని స్థితిలో అటవీశాఖ యంత్రాంగం ఉంది.
- కనుమరగవుతున్న కొండలు, అడవులు :
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో టేకు, గంధం తదితర చెట్లు కనుమరుగవుతున్నాయి. మందస, మెళియాపుట్టి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుసాని వంటి ప్రాంతాలకు అక్రమ మార్గంలో కలప రవాణా అవుతోంది. మహేంద్రగిరుల్లో భారీ గంజాయి వనాలతో పాటు సారా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. గతంలో ఆంధ్రా-ఒడిశా అధికారులు సంయుక్త దాడులు నిర్వహించేవారు. ప్రస్తుతం తనిఖీలు పెద్దగా లేకపోవడంతో వన్యప్రాణుల వేట సైతం యథేచ్ఛగా సాగుతోంది. ఏడాది కిందట మహేంద్రగిరుల్లో పట్టుకున్న అలుగును విక్రయిస్తుండగా నలుగురు యువకులు అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
- మసకబారుతున్న మహేంద్రగిరులు
తూర్పుకనుమల్లోనే ఎతైన మహేంద్రగిరులు వన్యప్రాణులకు నిలయాలు. లక్షల ఎకరాల్లో విస్తరించి ఉండే కొండలు అరుదైన పక్షులు, జంతువులకు ఆవాసాలు. సమయానుకూలంగా ఆహారంతో పాటు సమృద్ధిగా నీరు లభిస్తుంది. అందుకే ఇక్కడ ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, అలుగులు, నెమళ్లు, అడవి కోళ్లు, అరుదైన పక్షులు వంటివి కనిపిస్తుంటాయి. మహేంద్రగిరులు ఆంధా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నా.. మెజార్టీ భూభాగం మాత్రం ఒడిశాలోనే ఉంది. అభివృద్ధి పేరిట మహేంద్రగిరులు మసకబారుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం మహేంద్రగిరులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపరచింది. దీంతో దండకారణ్యాలు కాస్త చిట్టడవులుగా మారిపోతున్నాయి.
- ఇవి చేయాలి :
సాధారణంగా నీరున్న ప్రాంతాల్లోనే వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల అడవులు, కొండ ప్రాంతాల్లో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అందుకే అడవులు, కొండ ప్రాంతాల్లో చెలమలు, చెక్‌డ్యామ్‌లు, ఫైర్‌లైన్స్, సాసర్ పీట్లను ఏర్పాటుచేయాలి. నిఘా వలయాలు ఏర్పాటుచేస్తే వన్యప్రాణుల కదలికలను తెలుసుకోవచ్చు. వేటగాళ్లను నియంత్రించవచ్చు. సాసర్లు నిర్మించాలి. ఏటా వేసవిలో ట్యాంకర్లతో సాసర్లను నింపితే వన్యప్రాణుల దాహార్తిని తీర్చవచ్చు. సోలారు పంపుసెట్లు ఏర్పాటు చేస్తే.. శాశ్వత పరిష్కార మార్గం చూపినట్టవుతుంది.
సంరక్షణ చేపట్టాలి
జిల్లాలోని అటవీ ప్రాంతంతోపాటు మహేంద్రగిరుల్లో అరుదైన జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటికి వేసవిలో సంరక్షణ సక్రమంగా లేకపోవడంతో జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. చాలా అరుదైన ప్రాణులు కనుమరుగవుతున్నాయి. అందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలి.
- దట్టి చంద్రయ్య, జంతుశాస్త్ర అధ్యాపకుడు, టెక్కలి
..................................
అవగాహన కల్పిస్తున్నాం
వన్యప్రాణుల సంరక్షణ చర్యల కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక బృందాలు అటవీ ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తునే ఉంటాయి. అటవీ జంతువులకు కొండల ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు కల్పిసున్నాం. ఏనుగులు బెడద గతం కంటే తగ్గింది. తేలినీలాపురం, తేలికుంచి విదేశీపక్షుల సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్దానంలో ఎలుగుబంట్లు, కొండల ప్రాంతంలో దుప్పిలు, జింకలు వంటివి జనావాసాల్లోకి వస్తుండడంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం.
- నిషాకుమారి, జిల్లా అటవీశాఖ అధికారి
Updated Date - 2023-07-21T00:17:04+05:30 IST