నన్నేవరు ఆపేది
ABN, First Publish Date - 2023-06-26T00:13:09+05:30
అతను అధికార పార్టీలో ఓ చోటా నాయ కుడు. ప్రతీనెల రూ.లక్షలు ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికే పట్టణ నడి బొడ్డున విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించేశాడు. అదీ చాలక ఇంటి పక్కనే ఉన్న రూ.కోటి పైనే విలువ చేసే స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అతన్ని అంటిపెట్టుకొని దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఉంటాడు.
పొందూరు, జూన్ 25
అతను అధికార పార్టీలో ఓ చోటా నాయ కుడు. ప్రతీనెల రూ.లక్షలు ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికే పట్టణ నడి బొడ్డున విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించేశాడు. అదీ చాలక ఇంటి పక్కనే ఉన్న రూ.కోటి పైనే విలువ చేసే స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అతన్ని అంటిపెట్టుకొని దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఉంటాడు. ఇతన్ని తన వ్యాపారంలో కూలీగా పెట్టుకున్నాడు. ఎవరైనా అడిగితే వారిని బెదిరించడం, విననివారిపై తన అధికార పలుకుబడి ఉపయోగించి అట్రాసిటీ కేసులు పెట్టించడం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. పొందూరు పట్టణం మధ్యలో సర్వే నంబరు 196లో చెరువు గర్భం ఉంది. ఇక్కడ వైసీపీకి చెందిన చోటా నాయకుడు ఎటువంటి పత్రాలు లేకుండానే గతంలో ఇంటిని నిర్మించాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఆనుకుని ఉన్న 10 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ రక్షణ గోడను నిర్మిస్తో న్నాడు. దీని విలువ కోటి రూపాయలు పైనే ఉంటుంది. దీనిపై తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీంతో తహసీల్దార్ రాంబాబు ఆదేశాలతో వీఆర్వో రేవతిరావు శనివారం వెళ్లి ప్రభుత్వ స్థలంలో ఎలా నిర్మాణం చేస్తున్నావని, తక్షణమే నిలుపుదల చేయాలని ఆక్రమణ దారుడ్ని ఆదేశించారు. నిర్మాణం ఆపేస్తామ ని ఆయన చెప్పడంతో వీఆర్వో వెళ్లిపోయా రు. ఆ తరువాత అతను మళ్లీ నిర్మాణం కొనసాగించాడు. ఆదివారం ఉదయం మరోసారి వీఆర్వో వెళ్లి హెచ్చరించారు. ఓ కీలక నేత తనయుడు కొనసాగించుకోమని చెప్పారని, మీరెవరు ఆపమనడానికని వీఆర్వోపై అతను తిరగబడ్డాడు. ఏమి చేసుకుం టారో చేసుకోండని బెదిరించడంతో వీఆర్వో ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, 9 నెలల క్రితం ఇదే సర్వేనంబరులో చేపట్టిన నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో స్పీకర్ ఆదేశాలతో వాటిని అధికారులు నిలిపి వేయించారు. నిర్మాణదారులకు నోటీసులు సైతం ఇచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకుడే అక్రమ నిర్మాణం చేపడుతున్నా ఎందుకు ఆపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పట్టణవాసులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తాం..
గతంలో 196 సర్వే నంబరులో అక్రమ నిర్మాణాలపై చర్య లు తీసుకున్నాం. నిర్మాణాలను నిలిపివే యించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చాం. ఇప్పుడు ఎవరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. ఓ వ్యక్తి పెద్దవాళ్ల పేరు చెప్పి వీఆర్వోను బెదిరించినట్లు తెలిసింది. నిర్మాణం కొనసాగిస్తే పోలీసు కేసు పెట్టి ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తాం.
-ఆర్.రాంబాబు, తహసీల్దార్, పొందూరు
Updated Date - 2023-06-26T00:13:09+05:30 IST