ఇల్లు కట్టుకోవడానికీ.. లంచం
ABN, First Publish Date - 2023-08-02T00:08:38+05:30
ఆయనో ప్రైవేటు ఉపాధ్యాయుడు. తన ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావించాడు. ఇందుకు ప్లాన్ రావాలంటే ముందుగా ఖాళీ నివాస స్థలానికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలి. కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. ఆర్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు.
- వీఎల్‌టీ పేరిట రూ.20వేలు డిమాండ్
- ఏసీబీకి చిక్కిన కార్పొరేషన్ ఆర్‌ఐ గౌరీశంకర్
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 1: ఆయనో ప్రైవేటు ఉపాధ్యాయుడు. తన ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావించాడు. ఇందుకు ప్లాన్ రావాలంటే ముందుగా ఖాళీ నివాస స్థలానికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలి. కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. ఆర్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ ఆర్‌ఐ ఐతమ్ గౌరీశంకర్.. వీఎల్‌టీ పేరిట రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. బలగ హడ్కోకాలనీ భారతీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు పురుషోత్తానికి బలగలో 293 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో సొంతిల్లు కట్టుకోవాలని ప్లాన్ అనుమతి కోసం కార్పొరేషన్ ఆర్‌ఐ ఐతమ్ గౌరీశంకర్‌ను ఇటీవల ఆయన కలిశారు. స్థలానికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలని, ఈ పని పూర్తిచేసేందుకు రూ.20వేలు ఇవ్వాలని ఆర్‌ఐ డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు పురుష్తోతం నిరాకరించారు. ఈ విషయంపై పురుషోత్తం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు.. పురుషోత్తం సోమవారం ఆర్‌ఐకు ఫోన్ చేశారు. వీఎల్‌టీ కోసం డబ్బులు ఇస్తానని.. మంగళవారం తన ఇంటికి రావాలని చెప్పారు. మంగళవారం ఉదయం పురుషోత్తం ఇంటికి ఆర్‌ఐ గౌరీశంకర్ అటెండర్ సూర్యారావుతో కలిసి వెళ్లారు. రూ.20వేలు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి, సిబ్బంది కలిసి గౌరీశంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేశారు. అలాగే శ్రీకాకుళంలోని ఆర్‌ఐ ఇంటి వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు.
లంచం అడిగితే కాల్ 14400
ఏసీబీ డీఎస్పీ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్‌ఐ గౌరీశంకర్‌ను బుధవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే.. 14400 నెంబర్‌కు సమాచారం అందజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు భాస్కరరావు, హరి, ఎస్‌ఐలు చిన్నంనాయుడు, సత్యారావు, పీసీ అజయ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:08:38+05:30 IST