రూ.4 కోట్ల భూమి.. హాంఫట్!
ABN, First Publish Date - 2023-04-03T23:54:41+05:30
ఆమదావలసలో భూబాగోతాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే అక్రమాల పర్వం ఊపందుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలో పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి. ప్రభుత్వానికి విలువైన ఆస్తులుగా ఉన్నా పరిరక్షించడం లేదు.
ప్రభుత్వ భూములను వదలని అక్రమార్కులు
ఆమదాలవలసలో చెరువులు కనిపిస్తే కబ్జానే..
చక్కెర కర్మాగారం ఆస్తులపై కన్ను
పట్టాల పేరిట నిర్మాణాలు
పట్టించుకోని అధికారులు
(ఆమదాలవలస)
ఆమదాలవలస మునిసిపాలిటీ కృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని 118 సర్వే నంబర్‌లో చెరువు ఇది(పై చిత్రం). సుమారు 5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువును చక్కెర కర్మాగారం అవసరాలకు కేటాయించారు. చక్కెర కర్మాగారం మూతపడడంతో వృథాగా మారింది. దీంతో అక్రమార్కుల కన్ను ఈ చెరువుపై పడింది. పట్టాల పేరుతో కొందరు.. రాజకీయ సిఫారసులతో మరికొందరు ఆక్రమించుకుంటున్నారు. రెండు వైపులా నిర్మాణాలు చేపడుతూ వస్తున్నారు. దీంతో సుమారు రూ.4 కోట్ల విలువైన ఎకరా భూమి అక్రమార్కుల వశమైంది.
...........................................
ఆమదావలసలో భూబాగోతాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే అక్రమాల పర్వం ఊపందుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలో పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి. ప్రభుత్వానికి విలువైన ఆస్తులుగా ఉన్నా పరిరక్షించడం లేదు. పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు, కనకాంద్రి చెరువు, పాలబంద, కిల్లివాని చెరువు, పొడకల చెరువు.. ఇలా అన్నీ అక్రమార్కుల బారిన పడ్డాయి. అధికారులు రాజకీయ జోక్యంతో నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ తతంగం వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో.. ఎన్ని రకాల విమర్శలు వచ్చినా.. పత్రికల్లో కథనాలు వచ్చినా పట్టించుకునే వారు కరువయ్యారు.
ఆ రెండు చెరువులూ చెర
ఆమదాలవలస చక్కెర కర్మాగారం మూతపడి దశాబ్దాలు దాటుతోంది. పరిశ్రమను తెరిపిస్తామన్న నేతల హామీలు కార్యరూపం దాల్చలేదు. దాదాపు రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించి చేతులు దులుపుకొంది. అయితే ప్రత్యేకాధికారి ఫిర్యాదుతో కోట్లాది రూపాయల భూమి కైంకర్యం వెలుగులోకి వచ్చింది. కానీ అక్రమార్కులపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 117లో రెండు ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. 118 సర్వే నంబర్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మరో చెరువు ఉండేది. ఈ రెండు చెరువులను అప్పట్లో ఫ్యాక్టరీ నిర్వహణ అవసరాలకు కేటాయించారు. ఫ్యాక్టరీ మూతపడిన తరువాత చెరువులు నిరూపయోగమయ్యాయి. దీంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇప్పటికే పట్టాల పేరిట కొంత, ప్రభుత్వ భవనాల నిర్మాణం పేరిట కొంత స్థలం కరిగిపోయింది. మిగతా భూమిని కొంతమంది పట్టాలు పేరిట కైవసం చేసుకొని బేరం పెట్టేశారు. దీంతో దాదాపు రెండెకరాల విస్తీర్ణం గల చెరువు పూర్తిగా కరిగిపోయింది.
నిబంధనకు విరుద్ధంగా పట్టాలు?
తాజాగా సర్వే నంబర్ 118లోని చెరువుపై కొంతమంది కన్నేశారు. తమకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని కొందరు చెబుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువులు, కాలువల్లో పట్టాలివ్వకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనను కాదని.. పట్టాలు ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకమవుతోంది. సుమారు ఎకరా విస్తీర్ణంలో స్థలాలు చేతులు మారిపోయినట్టు తెలుస్తోంది. ప్రార్థనాలయాల పేరిట నిర్మాణం చేపడుతున్నారు. పునాదులు సైతం తీశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మునిసిపల్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫ్యాక్టరీకి ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి సైతం చెరువు ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి స్థానిక అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఆక్రమణదారులకు కనీసం నోటీసు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆమదాలవలస మునిసిపాలిటీలో చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆమదావలస మునిసిపాల్టీ ఇన్‌చార్జి కమిషనర్ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. దీనిపై తహసీల్దారు గణపతిరావును వివరణ కోరగా ఇప్పటికే చెరువు స్థలం వద్ద ప్రభుత్వం భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు.
Updated Date - 2023-04-03T23:54:41+05:30 IST