ఎదురుచూపు
ABN, First Publish Date - 2023-06-26T00:14:44+05:30
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు చెందిన చాలా మంది మహిళలకు అభయహస్తం నగదు అందలేదు. ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో గతంలో ప్రీమియం చెల్లించిన మహిళలు ఆ నగదు కోసం ఎదురుచూపు చూస్తున్నారు.
(ఇచ్ఛాపురం రూరల్)
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు చెందిన చాలా మంది మహిళలకు అభయహస్తం నగదు అందలేదు. ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో గతంలో ప్రీమియం చెల్లించిన మహిళలు ఆ నగదు కోసం ఎదురుచూపు చూస్తున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో 23,098 స్వయంశక్తి సంఘాల నుంచి 1,45,734 మంది ప్రీమియం డబ్బులు చెల్లించారు. ఈ పథకంలో నమోదైన మహిళలు 60 ఏళ్ల వయసు వరకు సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం మరికొంత నగదు జమచేసి ఎల్‌ఐసీ వారికి అందించేది. దీంతో 60 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి నెల రూ.500 పింఛన్ అందించేవారు. అభయహస్తంలో చేరిన మహిళ కుటుంబ సభ్యుల్లో 9, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చదివే విద్యార్థులు ఉంటే వారికి సంత్సరానికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాలను ఇద్దరు పిల్లలు వరకు చెల్లించేవారు. అభయహస్తం ప్రీమియం డబ్బులు కడుతూ సహజ మరణం పొందినవారికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70 వేలు వరకు అందించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా పింఛను మొత్తాన్ని రెట్టింపు చేసి అభయహస్తం పథకాన్ని నిలిపివేసింది. అయితే అభయహస్తం పథకం డబ్బుల చెల్లించిన మహిళలకు తిరిగి నగదు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు అందకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.
ఐదేళ్లు డబ్బులు చెల్లించాను
అభయహస్తం పథకంలో అయిదేళ్ల వరకు ప్రీమియం డబ్బులు చెల్లించాను. మధ్యలోనే పథకాన్ని నిలిపివేశారు. కట్టిన డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. సంవత్సరం గడిచిన ఇంతవరకు చెల్లించలేదు. త్వరగా డబ్బులు తమఖాతాలో జమచేయాలి.
- సరోజని మండలో, ఇచ్ఛాపురం మండలం.
పింఛను వచ్చే సమయానికి రద్దు చేశారు
ఆరేళ్లు పాటు అభయహస్తం పథకంలో డబ్బులు జమ చేశాను. మరో రెండు నెలల్లో పింఛను వస్తుందనగా పథకం రద్దు కావడంతో పింఛను నిలిచిపోయింది. తర్వాత వృద్ధాప్య పింఛను మంజూరైంది. జమ చేసిన డబ్బులు వస్తాయని చెప్పారు కానీ ఇంతవరకు అందలేదు.
- బి.లక్ష్మమ్మ, ఇచ్ఛాపురం మండలం.
వారి ఖాతాకే జమ అవుతాయి
అభహస్తం పథకంలో చెల్లించిన డబ్బులు ప్రభుత్వం ఇంకను లబ్ధిదారులకు జమ చేయలేదు. ప్రభుత్వం జమ చేసినప్పుడు నేరుగా వారి ఖాతాకే డబ్బులు వస్తాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు.
- డి.విద్యాసాగర్, డీఆర్‌డీఏ పీడీ, శ్రీకాకుళం.
Updated Date - 2023-06-26T00:14:44+05:30 IST