ఆగస్టు నాటికి ‘ఎత్తిపోతలు’!
ABN, First Publish Date - 2023-03-24T23:37:41+05:30
వంశధార కుడి ప్రధాన కాలువ నుంచి హిరమండలం వద్ద రిజర్వాయర్‌కు నీరు నింపేందుకు త్వరలో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరమలరావు తెలిపారు.
వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు
హిరమండలం, మార్చి 24: వంశధార కుడి ప్రధాన కాలువ నుంచి హిరమండలం వద్ద రిజర్వాయర్‌కు నీరు నింపేందుకు త్వరలో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరమలరావు తెలిపారు. శుక్రవారం గొట్టాబ్యారేజీ దిగువన మరమ్మతులకు గురైన జడ్జిస్టోన్ ఏప్రాన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హిరమండలం రిజర్వాయర్ 19 టీఎంసీల నీటిని నింపేందుకు నిర్మించినా.. ఐదేళ్లుగా వరదకాలువ ద్వారా 5 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు రావడం లేదు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరాలు ఉండటంతో ప్రత్యామ్నాయంగా హిరమండలం వద్ద రూ.170 కోట్లతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి.. వంశధార నుంచి రిజర్వాయర్‌లోకి నీరు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెలాఖరు నుంచి పనులు ప్రారంభిస్తాం. లిఫ్ట్ ద్వారా రిజర్వాయర్‌లో 12 టీఎంసీల నీటిని నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గొట్టాబ్యారేజీ నిర్వహణకు నిధులు లేక మరమ్మతులు జాప్యమవుతున్నాయి. మరమ్మతుల కోసం రూ.12.09 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం కేటగిరీ-ఏ కింద రూ.27లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఈ నిధులతో మేజర్ మరమ్మతులు ఎలా చేపట్టాలని చర్చిస్తున్నాం. బ్యారేజీకి అనుసంధానంగా ఉన్న ఎడమ ప్రధాన కాలువలు కూడా ఆధునికీకరించాల్సి ఉంది. ఇందుకోసం రూ.900 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. బ్యారేజీ గేట్ల నిర్వహణ, ప్లడ్ బ్యాంకులు, గ్రోయిన్ల మరమ్మతుల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.25కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. హిరమండలం రిజర్వాయర్‌తో పాటు,87,88 ప్యాకేజీలకు సంబంధించి రూ.40 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు మరో రూ.100కోట్లు అవసరం. రూ.300 కోట్లతో ఆఫ్‌షోర్ పనులు జరుగుతున్నాయి. వీటిని పూర్తిచేసేందుకు మరో రూ.100కోట్లు అవసరం’ అని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఈ ఎం.వి.రమణ, ఈఈ ప్రదీప్, డీఈఈలు అనిల్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-24T23:37:41+05:30 IST