అమృత్ సరోవర్ అంతేనా?
ABN, First Publish Date - 2023-09-04T00:11:33+05:30
చెరువులు.. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు కల్పతరువు. క్షేత్రస్థాయిలో ఆహ్లాదం పంచేలా చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమృత్‌సరోవర్ పథకం కింద ఒక్కో మండలం పరిధిలో రెండు, మూడు చెరువులను చొప్పున ఎంపిక చేసింది.
- నత్తనడకన సాగుతున్న పనులు
- అభివృద్ధికి నోచుకోని చెరువులు
(మెళియాపుట్టి)
- మెళియాపుట్టి మండలం పరశురాంపురం పంచాయతీ తూముకొండ రామచంద్రాపురంలోని చెరువును అభివృద్ధి చేసేందుకు అమృత్ సరోవర్ పథకం కింద రూ.10లక్షలు మంజూరు చేశారు. నిధులు మంజూరై ఏడాది కావస్తున్నా.. ఇంతవరకూ మట్టి పనులు మాత్రమే చేశారు. ఇతర అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.........
- మెళియాపుట్టి మండలం జాడుపల్లి పంచాయతీలోని రెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ.10లక్షలు నిధులు మంజూరయ్యాయి. చెరువులకు మరమ్మతులు చేసి సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు, పాలకులు ప్రకటించారు. కానీ ఇంతవరకూ పనులు చేపట్టలేదు.
.........
చెరువులు.. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు కల్పతరువు. క్షేత్రస్థాయిలో ఆహ్లాదం పంచేలా చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమృత్‌సరోవర్ పథకం కింద ఒక్కో మండలం పరిధిలో రెండు, మూడు చెరువులను చొప్పున ఎంపిక చేసింది. జిల్లాలో గతేడాది 80 చెరువులను ఎంపిక చేయగా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా చెరువుల్లో తాగునీటి ర్యాంపులు నిర్వహించాలి. గట్లపై రాళ్లు పేర్చాలి. గట్లపై విశ్రాంతి తీసుకునేందుకు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయాలి. ఆహ్లాదం కోసం చెరువు చుట్టూ 40 కొబ్బరి మొక్కలు నాటాలి. ఇందుకోసం ఒక్కో చెరువుకు సుమారు రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. కానీ ఎక్కడా పనులు పూర్తికాలేదు. చెరువుల్లో పూడికతీతలు మాత్రమే పూర్తిచేశారు. ఉపాధిహామీ వేతనదారులతో మట్టిపనులు చేయించినా.. సిమెంటు పనులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు చేపట్టడం లేదు. అలాగే ఎన్నికల కాలం సమీపిస్తున్న తరుణంలో.. ఈ పనులు పూర్తిచేసే పరిస్థితి లేదని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం.. నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. దాతల సహకారంతో కొంతమేర పనులు చేయాలని చెబుతున్నా.. ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు వేగవంతానికి చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
పనులు చేపడతాం
నిధులు వచ్చిన వెంటనే అమృత్ సరోవర్ పనులు చేపడతాం. ఎంపికైన గ్రామాల ప్రజలు, దాతల సహకారం తీసుకుని పనులు చేస్తున్నాం. కొన్ని చెరువుల్లో మట్టి పనులు పూర్తిచేసి.. గట్లపై కొబ్బరి చెట్లు నాటాం.
- టి.రవి, ఏపీవో, మెళియాపుట్టి
Updated Date - 2023-09-04T00:11:33+05:30 IST