ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో.. మంజూరు కాని ప్రశ్నపత్రాలు
ABN, First Publish Date - 2023-08-02T00:01:05+05:30
టెక్కలి మండలంలో ఐదు ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు మంజూరు కాక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
- టెక్కలిలో ఐదు పాఠశాలలకు పంపిణీ కాని వైనం
- విద్యార్థులకు తప్పని అవస్థలు
టెక్కలి రూరల్, ఆగస్టు 1: టెక్కలి మండలంలో ఐదు ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు మంజూరు కాక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రావివలస, చాకిపల్లి, నర్సింగపల్లి, లింగాలవలస, భీంపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు మంజూరు కాలేదు. పరీక్ష ప్రారంభమైన సమయంలో ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈవోల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి సమాచారం చేరింది. దీంతో మండలంలో ఇతర పాఠశాలల నుంచి ప్రశ్నాపత్రాలను తెప్పించారు. తరగతి గదిలో బోర్డుపై ప్రశ్నలు రాశారు. విద్యార్థులు వాటిని చూసి సమాధానాలు రాశారు. 45 నిమిషాల వ్యవధిలో పరీక్షలు పూర్తవ్వాల్సి ఉండగా.. ప్రశ్నాపత్రాల మంజూరులో జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని తెలుగు,ఆంగ్ల మాద్యమంలో సంయుక్త బోధన కలిగి ఉన్న పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు వచ్చిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించారు. కేవలం తెలుగు మాధ్యమం బోధించే ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఈ సమస్యకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై టెక్కలి ఎంఈవో డీ.చిన్నారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలకు సంబంధించిన తెలుగు మాధ్యమం ప్రశ్నాపత్రాలు జిల్లా నుంచి సరఫరా కాలేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2023-08-02T00:01:05+05:30 IST