యూనిఫాం కుట్టించేదెలా?
ABN, First Publish Date - 2023-08-26T00:31:58+05:30
జిల్లాలో చాలామంది విద్యార్థులకు సంబంధించి యూనిఫాం కుట్టుకూలిని ప్రభుత్వం చెల్లించలేదు. ఫలితంగా విద్యార్థులు యూనిఫాం లేకుండానే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది.
- రెండేళ్లుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమకాని నగదు
- రూ.4.58కోట్లు బకాయిలు
- తల్లిదండ్రులపై కుట్టుకూలి భారం
(మెళియాపుట్టి)
- మెళియాపుట్టి మండలం నేలబొంతు గ్రామానికి చెందిన పి.వరలక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె స్థానిక ఆశ్రమ పాఠశాలలో, కుమారుడు నేలబొంతు గిరిజన పాఠశాలలో చదువుతున్నారు. వీరికి మూడు జతల చొప్పున యూనిఫాం దుస్తులు అందించారు. వీటిని కుట్టించుకొనే ఆర్థికస్థోమత లేకపోవడంతో సివిల్ దుస్తులనే ధరించి పాఠశాలలకు వెళ్తున్నారు. కుట్టు కూలి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదని వరలక్ష్మి వాపోతోంది. ఒక జత యూనిఫాం కుట్టేందుకు టైలర్ రూ.400 వరకు తీసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలకు సంబంధించి ఆరు జతలను కుట్టించేందుకు రూ.2400 వరకు ఖర్చు అవుతోందని, ఈ భారం భరించలేక యూనిఫాం కుట్టించలేదని వరలక్ష్మి చెబుతోంది.
.......................
- మెళియాపుట్టి మండలం దాసుపురం గ్రామానికి చెందిన ఎస్.మౌనికకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చీపురుపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి, కుమారుడు పెదమడి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఆరు జతల యూనిఫాంను కుట్టేందుకు రూ.3వేలు ఖర్చు అవుతుందని టైలర్ చెప్పాడని, దీంతో అంత స్థోమత లేక వాటిని కుట్టించకుండా వదిలేసినట్లు మౌనిక చెబుతోంది. ప్రభుత్వం కుట్టు కూలి జమ చేయలేదని వాపోతోంది.
.......................
..ఇలా జిల్లాలో చాలామంది విద్యార్థులకు సంబంధించి యూనిఫాం కుట్టుకూలిని ప్రభుత్వం చెల్లించలేదు. ఫలితంగా విద్యార్థులు యూనిఫాం లేకుండానే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,91,396 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ప్రభుత్వమే యూనిఫాం కుట్టించి విద్యార్థులకు ఇచ్చేది. అయితే, కొందరు విద్యార్థులకు అవి సరిపోయేవి కావు. విద్యార్థుల శరీరాకృతులకు అనుగుణంగా అవి లేకపోవడంతో ఈ విధానానికి మూడేళ్ల కిందట ప్రభుత్వం స్వస్తి పలికింది. దీనిస్థానంలో ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం వస్త్రం అందించడంతో పాటు కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాలో జమ చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పిల్లల కొలతల ప్రకారం నచ్చిన చోట వాటిని కుట్టించుకోవచ్చునని చెప్పారు. దీనికోసం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక జత యూనిఫాంకు రూ.40 చొప్పున, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.80 చొప్పున కుట్టు కూలి అందజేస్తామని తెలిపారు. మొదటి ఏడాది మాత్రమే నగదును జమ చేశారు. గత రెండేళ్ల నుంచి తల్లుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమకావడం లేదు. ప్రభుత్వం నుంచి సుమారు రూ.4.58 కోట్లు జమకావాల్సి ఉంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల యూనిఫాంను కుట్టించేందుకు సొంతంగా నగదు చెల్లిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో వాటిని కుట్టించలేకపోతున్నారు.
రూ.120తో మూడు జతలు కుట్టించుకోవాలా?
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక జత యూనిఫాం కుట్టించేందుకు ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. మొత్తం మూడు జతలకు రూ.120 అందిస్తుంది. ఈ నగదు దేనికీ సరిపోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 8వ తరగతి విద్యార్థికి సంబంధించి ఒక జత యూనిఫాంను కుట్టేందుకు టైలర్ రూ.400 వరకు వసూలు చేస్తున్నాడని, మూడు జతలకు రూ.1200 తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.120 మాత్రమే ఇస్తుందని, ఈ డబ్బులతో మూడు జతలను ఎలా కుట్టించేదని ప్రశ్నిస్తున్నారు.
వివరాలు అందజేశాం..
మెళియాపుట్టి మండలంలోని విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. త్వరలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమవుతుంది.
-ఎస్.దేవేంద్రరావు, ఎంఈవో, మెళియాపుట్టి
Updated Date - 2023-08-26T00:31:58+05:30 IST