ఎచ్చెర్ల ఎమ్మెల్యే మాకొద్దు!
ABN, First Publish Date - 2023-05-22T00:35:21+05:30
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంతపార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. ఓవైపు వైసీపీకి విధేయులమంటూనే.. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ తీరును వ్యతిరేకిస్తూ కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ర్యాలీ చేశారు.
- కిరణ్‌పై సొంతపార్టీలోనే అసమ్మతి
- ఆయన తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
- శ్రీకాకుళంలో ఎచ్చెర్ల వైసీపీ నేతల సమావేశం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంతపార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. ఓవైపు వైసీపీకి విధేయులమంటూనే.. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ తీరును వ్యతిరేకిస్తూ కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ర్యాలీ చేశారు. అలాగే గుజరాతీపేట సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు సమావేశమై ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. గత ఎన్నికల్లో కిరణ్ గెలుపునకు తామంతా కృషి చేయగా.. మండలస్థాయి పదవులు ఇచ్చేసరికి తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని కార్యక్రమాలు రూపొందిస్తే.. తమకు ఎమ్మెల్యే తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కిరణ్‌కుమార్‌కు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని ముక్తకంఠంతో ప్రకటించారు. ‘‘జగన్ ముద్దు..కిరణ్ వద్దు’, ‘జగన్ కావాలి.. కిరణ్ పోవాలి’’ అంటూ నినాదాలు చేశారు. తొలుత ఎచ్చెర్ల నుంచి వీరంతా ర్యాలీగా బయలుదేరారు. ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్ వద్దకు చేరే సరికి ర్యాలీకి అనుమతి లేదంటూ ఎస్‌ఐ సత్యనారాయణ అడ్డుతగిలారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు బైక్‌లపై ఎవరికివారే సమావేశానికి హాజరయ్యారు.
- వైసీపీ నేత జరుగుళ్ల శంకరరావు మాట్లాడుతూ.. ‘పదేళ్లుగా వైసీపీ బలోపేతానికి తీవ్రంగా కష్టపడ్డాను. అత్యధిక సంఖ్యలో ఎంపీటీసీల గెలుపునకు కృషి చేశాను. ఎచ్చెర్ల ఎంపీపీ పదవి ఇస్తామని ఎమ్మెల్యే కిరణ్ హామీ ఇచ్చి.. మాటతప్పారు. మండల కన్వీనర్ పదవిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇదెక్కడ న్యాయం. వైసీపీ బలపరిచిన అభ్యర్థులను కాకుండా ఇతరులను వలంటీర్లుగా నియమించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగనివ్వడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
- మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ‘జగన్ పార్టీని ప్రకటించిన వెంటనే జిల్లాలో తొలిసారిగా వైసీపీలో చేరాను. నా స్వగ్రామం కుప్పిలిలో కూడా నాకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేసేందుకు ఎమ్మెల్యే వెనుకాడలేదు. ఎమ్మెల్యేగా కిరణ్ కోట్లాది రూపాయలు దండుకుని అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయమై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో ధర్మవరం సర్పంచ్ అల్లు కన్నబాబు, మాజీ సర్పంచ్‌లు బల్లాడ వెంకటప్పారావురెడ్డి, జి.సిగడాం మండలపార్టీ మాజీ అధ్యక్షుడు ఆబోతుల జగన్నాథం, ఎచ్చెర్ల మండలపరిషత్ ఉపాధ్యక్షురాలు జరుగుళ్ల విజయకుమారి, ఎచ్చెర్ల సర్పంచ్ జయలక్ష్మి, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, సుమారు 300 మంది అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-22T00:35:21+05:30 IST