డబ్బిస్తేనే వ్యవసాయ సర్వీసు
ABN, First Publish Date - 2023-03-02T00:20:31+05:30
వ్యవసాయ బోరుకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఏఈ రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. బాధిత రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి.. ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు.
రూ.30 వేలు డిమాండ్ చేసిన విద్యుత్ ఏఈ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం
శ్రీకాకుళం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బోరుకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఏఈ రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. బాధిత రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి.. ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతులు పొలాల్లో వ్యవసాయ బోర్లను తవ్వించారు. వాటికి మోటార్లు అమర్చుకునేందుకు విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించాలంటూ ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. శ్రీకాకుళం రూరల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ జి.వెంకటరమణను రైతులు నేరుగా కలిసి విద్యుత్ కనెక్షన్ కల్పించాలని కోరారు. కాగా.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15వేలు చొప్పున.. ఇద్దరు రూ. 30వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేశారు. ఏఈ లంచం డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రధాన కార్యాలయం నుంచి శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తికి సమాచారం చేరింది. ముందుగా ఏసీబీ అధికారులు ఇచ్చిన సూచన మేరకు రైతులు బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్(శ్రీకాకుళం రూరల్ సెక్షన్ ఆఫీసు)లో ఉన్న ఏఈని కలిశారు. లంచం డబ్బులు రూ.30వేలు అందించారు. అదే సమయంలో మాటువేసిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిబ్బంది.. రెడ్‌హ్యాండెడ్‌గా ఏఈని పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ.. పట్టుబడిన ఏఈ జి.వెంకటరమణను విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్డులో రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే... ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.
Updated Date - 2023-03-02T00:20:31+05:30 IST