Settlement : సర్కార్ వారి సెటిల్‌మెంట్
ABN, First Publish Date - 2023-05-02T03:29:56+05:30
రియల్ ఎస్టేట్‌లో సెటిల్‌మెంట్లు, భూఆక్రమణల దందాల గురించి వినుంటారు. అక్రమ వసూళ్లకు పాల్పడే గ్యాంగ్‌ల గురించీ వినుంటారు. ఈ వ్యవహారాలన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేసేవి. ఇలాంటి వాటిని
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలపై బేరాలు
ప్రైవేటు పీజీ కాలేజీలపై ఒత్తిడి
గత ప్రభుత్వంలోని 450 కోట్ల బకాయిలు
చెల్లించామని జగన్ సర్కారు గొప్పలు
నాలుగేళ్లయినా చెల్లించని వైనం
అడిగినందుకు తనిఖీలతో బెదిరింపులు
కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు
కోర్టు ఆదేశించినా చెల్లింపులు లేవు
ఇప్పుడు ధిక్కరణ కేసులకు భయపడి
80 శాతమే ఇస్తామంటూ బేరసారాలు
20 శాతం అడగరాదని షరతులు
వినకపోతే అనుమతి రద్దు అంటూ హెచ్చరిక
నేడు ఉన్నత విద్యామండలిలో సమావేశం
‘చంద్రబాబు హయాంలో ప్రైవేట్ పీజీ కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించేశాం’.. సీఎం జగన్ తరచూ చెప్పే మాట ఇది. ఈ మాటే నిజమైతే కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు ఎందుకెళ్తాయి? ప్రభుత్వంపై కేసులు ఎందుకు వేస్తాయి? కోర్టు మెట్లు ఎక్కాయంటే బకాయిలు చెల్లించలేదనే కదా! అంటే... జగన్ చెప్పిన మాట అబద్ధమన్న మాట.
ప్రైవేటు పీజీ కాలేజీలకు దాదాపు రూ.450 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కోర్టు ఆదేశించినా జగన్ సర్కారు ఫీజులు చెల్లించలేదు. ఇప్పుడు డజన్ల కొద్దీ కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేక బెదిరింపులకు దిగుతోంది. ‘80 శాతం ఇస్తాం’.. సరిపెట్టుకోవాలంటూ బేరసారాలకు పాల్పడుతోంది. వినకపోతే కాలేజీల అనుమతి రద్దు చేస్తామంటూ హెచ్చరిస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రియల్ ఎస్టేట్‌లో సెటిల్‌మెంట్లు, భూఆక్రమణల దందాల గురించి వినుంటారు. అక్రమ వసూళ్లకు పాల్పడే గ్యాంగ్‌ల గురించీ వినుంటారు. ఈ వ్యవహారాలన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేసేవి. ఇలాంటి వాటిని ప్రభుత్వం అరికట్టాలి. అయితే రాష్ట్రంలో విచిత్రంగా సర్కారే సెటిల్‌మెంట్లకు శ్రీకారం చుట్టింది. తమ మాట వినకుంటే శంకరగిరి మాన్యాలేనంటూ బెదిరిస్తోంది. ప్రైవేటు పీజీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా బేరసారాలకు దిగింది. 80 శాతం ఫీజులు మాత్రమే చెల్లిస్తామని, ఇందుకు ఒప్పుకోకపోతే కళాశాలల అనుమతి సంగతి చూస్తామని సర్కారు బెదిరిస్తోందని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ రాకముందు 2017 నుంచి 2019 దాకా రూ.450 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు తామే చెల్లించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే కానీ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు 2020-21 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వైసీపీ సర్కార్ రద్దు చేసింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అంతేగాక అంతకుముందు పీజీ రెండో సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టింది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యాదీవెనను ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పుడు ఆ బకాయిలను విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని అధికారులు చెబుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.
తనిఖీలపై తనిఖీలు
వైసీపీ సర్కారు వచ్చాక యాజమాన్యాలు బకాయిలు అడగడంతో చెల్లించకపోగా బెదిరింపులకు దిగింది. ప్రైవేటు పీజీ కళాశాలలు అక్రమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ క్లైయిం చేస్తున్నాయంటూ పలు రకాల తనిఖీలు చేపట్టారు. మొదట ఉన్నత విద్యామండలి తనిఖీ చేపట్టింది. ఆ తర్వాత విజిలెన్స్ విభాగం ద్వారా తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత యూనివర్సిటీ అధికారులతోనూ విచారణ చేపట్టారు. అయితే ఏ తనిఖీలోనూ కళాశాలలపై అవకతవకలను నిరూపించలేకపోయారు. అయినా బకాయిలు చెల్లించకపోవడంతో పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కొన్ని కేసుల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ధిక్కారణ పిటిషన్లు వేశారు.
కాలేజీలపై ఒత్తిడి
గత ప్రభుత్వంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో కోర్టులకు వెళ్లబోమని అఫిడవిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారు. ఇదే తరహాలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో జగన్ సర్కార్ బేరసారాలకు దిగింది. కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కోలేక ప్రైవేటు కళాశాలలపై బెదిరింపులకు దిగింది. ‘మేం ఇచ్చినంత తీసుకోండి. సెటిల్‌మెంట్ చేసుకోండి. లేకపోతే మీ కళాశాలలకు అనుమతి రద్దు చేస్తాం’ అంటూ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇప్పటికీ కోర్టులకు వెళ్లనివారు, కోర్టులో కేసులు వేసి తీర్పు రానివి, కోర్టు ధిక్కరణ కేసులు వేసినవారితో సెటిల్‌మెంట్‌కు సర్కార్ సిద్దమైంది. 80 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో సరిపెట్టుకుంటామని, మిగిలిన 20 శాతం కోసం అడగబోమని, కోర్టులను ఆశ్రయించబోమని అఫిడవిట్‌లు ఇవ్వాలని యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువస్తోంది.
అన్ని శాఖల్లోనూ ఇదే తంతు
పంచాయతీరాజ్, ఇరిగేషన్‌లో గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల విషయంలో కూడా ఇదేవిధంగా ప్రభుత్వం వ్యవహరించింది. రెండేళ్ల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. దాంతో వారి పనులపై విజిలెన్స్, శాఖాపరమైన తనిఖీలు చేపట్టారు. చివరకు ఏసీబీ తనిఖీలు చేపట్టారు. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసులు నడవడంతో విధిలేని పరిస్థితిలో 80 శాతం చెల్లింపులు చేపట్టి మిగతా 20 శాతం విజిలెన్స్ నివేదికలు వచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పారు. ఆతర్వాత వాటి ఊసే లేదు. ఆ 20 శాతంపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Updated Date - 2023-05-02T03:29:56+05:30 IST