వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ABN, First Publish Date - 2023-03-22T22:31:59+05:30
పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా వసంత నవరాత్రి మహోత్సవాలను బుధవారం వైభవంగా ప్రారంభించారు.
త్రిపురాంతకం, మార్చి 22 : పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా వసంత నవరాత్రి మహోత్సవాలను బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వసంత నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, ఉభయదాతలు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ అర్చకులు విశ్వం, ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, కాల పూజలు, బాలభోగం, విఘ్నేశ్వర పూజ, పంచగవ్యప్రాసన, అఖండ స్థాపన, మండపారాధన, అష్టదిక్పాలకపూజ, ఉభయదారుల కుంకుమార్చన, స్వామివారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గోపూజ, అమ్మవారికి ఆలయ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా త్రిపురాంతకేశ్వరస్వామి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిపురాంతకేశ్వరస్వామి, త్రిపురాంబ అమ్మవార్లకు అభి షేకాలు, పూజల అనంతరం పూలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిని గ్రామానికి తరలించి పలు వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు.
Updated Date - 2023-03-22T22:33:02+05:30 IST