సంప్రదాయ బద్ధంగా భోగి
ABN, First Publish Date - 2023-01-15T01:27:47+05:30
సంక్రాంతి పర్వదినం సందర్భంగా తొలిరోజు భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
మార్కాపురం(వన్‌టౌన్), జనవరి 14: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తొలిరోజు భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తన ఇంటి ముందు భోగి మంటలు వేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో గడ్డి, కర్రలు, పిడకలు, ఇళ్లలోని పాతసామాన్లు వేసి భోగి మంటలు వేశారు. ఇండ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దారు.
గిద్దలూరు : సంక్రాంతి పర్వదినాల్లో మొదటగా వచ్చిన భోగి పండుగను శనివారం ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పట్టణం, గ్రామాల్లో సంక్రాంతి హడావిడి కనిపించింది. శనివారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు భోగిపండ్లు పోశారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గ్రామాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో సంక్రాంతికి ముందుగా వచ్చే భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గుల వేసి గొబ్బెమ్మలు పెట్టారు.
పొదిలి రూరల్ : మండలంలో భోగి పండుగను ప్రజలు సాంప్రదాయబద్ధంగా జరపుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రైతులు తెల్లవారుజామునుండే భోగిమంటలు వేశారు. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకకగా సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా శనివారం ప్రజలు వీధుల్లో బోగి మంటలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువతులు వేకువ జామున నాలుగు గంటల నుంచే వీధుల్లో ఇళ్ల ముంగిట బోగి మంటలు వేశారు. దూరప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల రాకతో గృహాలు కళకళలాడాయి. కొమరోలు : భోగి పండుగ సందర్భంగా గ్రామాల్లోని పలు దేవాలయాల్లో సంక్రాంతి వేడుకలను వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమరోలులోని శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మివెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో గోదాదేవి, గోవిందుని కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యాక్రమాన్ని చూసేందుకు మండలంలోని భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఆలయ ధర్మకర్త దేవర రమేష్ ఆధ్వర్యంలో వసతులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రిపురాంతకం : ధనుర్మాసం సందర్బంగా నెల రోజుల నుండి పూజలు చేస్తున్న భక్తులు భోగి సందర్భంగా గోదా రంగనాయకస్వామి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్‌ఎస్‌పీ కాలనీలోని వెంకటేశ్వరాలయంలో అర్చకులు రామశ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. వేదమంత్రాల నడుమ కల్యాణం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్ధప్రసాదాలు, అన్న ప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.
కంభం : పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా 108 కళశాలతో కుడరైపాసురం ఉత్సవం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి మూలవిరాట్‌కు అర్చకులు నారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభకృత నామసంవత్సర పుష్యబహుళ సప్తమి శనివారం ఉదయం 10 గంటలకు హస్తనక్షత్రం పుష్కరాంశంలో ఆలయ మండపంలో గోదాదేవికి, రంగనాథస్వాముల కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి మంగళసూత్రాలు కొల్లి రమేష్, శైలజ దంపతులు సమర్పించారు. భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. సాయంత్రం గుడిఉత్సవం, ఊర్జసేవలు నిర్వహించారు.
మార్కాపురం(వన్‌టౌన్) : ధనుర్మాసం పురస్కరిం చుకొని భోగి పండుగ సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రధానర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు చెన్నకేశవస్వామిని శ్రీరంగ నాథుని అలంకారంలో గోదాదేవిని విశేష అలంకారంతో అలంకరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ ఘట్టాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ పి.కేశవరావు, ఈవో జి.శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు ఆలయ సిబ్బంది కార్యక్రమాలు పర్యవేక్షించారు.
Updated Date - 2023-01-15T01:28:00+05:30 IST