నేడు ఎన్టీఆర్ వర్ధంతి
ABN, First Publish Date - 2023-01-18T00:50:25+05:30
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. బుధవారం ఆయన 27వ వర్ధంతి కాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించేందుకు పార్టీ కార్యకర్తలు సమాయత్తమయ్యారు.
భారీగా నిర్వహణకు తెలుగు తమ్ముళ్ల సమాయత్తం
రక్తదాన శిబిరాలు, అన్నదానాలకు ఏర్పాట్లు
ఒంగోలు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. బుధవారం ఆయన 27వ వర్ధంతి కాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించేందుకు పార్టీ కార్యకర్తలు సమాయత్తమయ్యారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, పల్లె, పట్టణం అన్నిచోట్లా అన్నదానం.. ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిలను టీడీపీ శ్రేణులు బాగానే చేస్తుంటారు. ఈసారి ఎన్టీఆర్ శత జయంతి ఏడాది కావడంతోపాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ఒకరకమైన వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత అధికంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించే విధంగా పార్టీశ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయాలక తీతంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం భారీగా నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక చెన్నకేశవస్వామి లేఅవుట్‌లోని పార్కు వద్ద ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని ఇతర అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిల నేతృత్వంలో మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలన్నింటిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాల్లో రక్తదాన శిబిరాలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలలో పండ్లు పంపిణీ, ఇతరత్రా సేవా కార్యక్రమాలు చేయనున్నారు.
Updated Date - 2023-01-18T00:50:27+05:30 IST