తాగునీటి సమస్యపై గగ్గొలు!
ABN, First Publish Date - 2023-03-05T00:26:34+05:30
‘ఇంకా వేసవి రాలేదు. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో మరింత దారుణంగా ఉంటుంది.
వేసవికి ముందే నీటి ఎద్దడి
పరిస్థితిలో మార్పు రాకపోతే తీవ్ర ఇబ్బందులు
ట్యాంకర్ల బిల్లుల చెల్లింపులతోపాటు చేతిపంపులు, ఇతర స్కీంలకు మరమ్మతులు చేపట్టాలి
క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లేక ఇబ్బందులు
సత్వరమే చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్
వాడీవేడిగా సాగిన జడ్పీ సర్వసభ్య సమావేశం
‘ఇంకా వేసవి రాలేదు. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో మరింత దారుణంగా ఉంటుంది. మంచినీటి స్కీంలకు సంబంధించిన పైపులైన్ల లీకులను కూడా అరికట్టడం లేదు. ఉన్న నీటి వనరుల వినియోగానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డంతో ప్రజానీకం నీటి కోసం రోడ్డున పడాల్సి వస్తోంది. ఇప్పటికే ట్యాంకర్లకు బిల్లుల చెల్లింపులు లేవు. అనేక ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు..’ అని జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సభ్యులు చెప్పిన సమస్యను విని.... వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఉన్నతాధికారులే కీలకమైన సమావేశానికి రాకపోతే.... ఇదంతా ఎందుకంటూ కొంతమంది సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ శనివారం పాత జడ్పీ సమావేశం హాలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం తీరు.
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 4 : తాగునీటి సమస్య, బిల్లుల చెల్లింపులు, అధికారుల తీరుపై జడ్పీ సమావేశం వాడీవేడిగా సాగింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శనివారం నిర్వహించిన సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అజెండా.. తీర్మానాలు లేకుండా సభ ప్రారంభమైంది. అత్యవసరమైన మంచినీటి సమస్యతోపాటు విద్యుత్ వినియోగంపై సభలో చర్చ జరిగింది. ఎంపీపీలు తిరుపతిరెడ్డి, ప్రకాశం, నాయుడు, సావిత్రి, జాన్‌పాల్‌తోపాటు త్రిపురాంతకం, వెలిగండ్ల, కొమరోలు, పామూరు, అద్దంకి జడ్పీటీసీ సభ్యులు నీటి సమస్యను ఏకరువు పెట్టారు. కనీసం పైపులైన్లు పగిలితే మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కాలయాపన చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. కనిగిరి పట్టణంలో ట్యాంకర్ల యజమానులకు బిల్లులు చెల్లించకపోతే సరఫరాను నిలుపుదల చేశారని, ఏదో ఒకవిధంగా వారితో మాట్లాడి పది రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో ప్రస్తుతం తోలుతున్నారని తెలిపారు. ఆ గడువు కూడా మరో నాలుగు రోజుల్లో ముగియనుందని, నీటిని నిలుపుదల చేస్తే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
బిల్లులు రావాల్సి ఉంది..
సభ్యుల ఆందోళనపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మర్దన్ ఆలీ మాట్లాడుతూ 2020 నుంచి ఇప్పటివరకు రూ.132 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల రూ.50కోట్లు విడుదల చేసిందన్నారు. ముందుగా కోర్టును ఆశ్రయించిన వారికి చెల్లింపులు చేస్తామని తెలిపారు. మిగిలిన డబ్బులను ట్యాంకర్ల యజమానులకు చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 115 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. రానున్న రోజుల్లో 258 గ్రామాలకుపైగా నీటిని సరఫరా చేయాల్సి వస్తోందని ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. అన్ని ట్యాంకులు, చెరువుల్లో 70 నుంచి 80శాతం నీరు ఉందని, మిగిలిన భాగాన్ని సాగర్ నీటితో నింపేందుకు చర్యలు తీసుకున్నామని ఇరిగేషన్ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల ఇళ్లకు కొళాయి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 60 వేల కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.
నీటిని నింపేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ
సాగర్ నీటితో చెరువులు, ట్యాంకులు నింపేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహకారంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాగర్ కాలువల పరిధిలో పంటలు కూడా ఉన్నందున వాటిని రక్షించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నేను ప్రజాప్రతినిధినేనా...?
తాను ప్రజాప్రతినిధినేనా అన్న అనుమానం కలుగుతుందని ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి వాపోయారు. తమ నియోజకవర్గానికి ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చాక కనీసం అధికారులు తనను జడ్పీటీసీగా కూడా చూడటం లేదన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. చివరకు జడ్పీటీసీగా తాను చెప్పిన పనులు చేయొద్దుని మండల అధికారులపై రాజ్యాంగేతరశక్తి ఒత్తిడి పెట్టిందన్నారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సంబంధిత అధికారుల వివరణ కోరారు. అందుకు సంబంధించిన అధికారి లేకపోవడంతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇదేసమయంలో కొరిశపాడు జడ్పీటీసీ సభ్యురాలు అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి వల్ల తనకు ఎటువంటి పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు రాకపోతే సమావేశం ఎందుకు పెట్టినట్లు?
కీలకమైన సమావేశానికి కలెక్టర్ స్థాయి అధికారులు రాకపోతే సమస్యలు ఏవిధంగా పరిష్కారం అవుతాయని త్రిపురాంతకం జడ్పీటీసీ సభ్యుడు జాన్‌పాల్ ప్రశ్నించారు. మిగతా అధికారులను దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులకు ఉంటుందని, అటువంటి వారు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
భావోద్వేగానికి గురైన విఠపు
త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం భావాద్వేగానికి గురయ్యారు. 2007 నుంచి తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశానని తెలిపారు. తనకు ఇది చివరి సమావేశమంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను కంభంలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశానని తెలిపారు. ఆ ప్రాంత ప్రజానీకం ఎక్కువ మంది ఆర్మీలో పనిచేస్తూ అనేక యుద్ధాల్లో పాల్గొన్నారన్నారు. అప్పటి నుంచి అక్కడ విద్యారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. వేటపాలెంలోని లైబ్రరీని డిజిటల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి ఎమ్మెల్సీ విఠపు సేవలను వినియోగించుకుం టామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, డిప్యూటీ సీఈవో హనుమంతరావుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
సాగర్ నీటితో చెరువులు, ట్యాంకులు నింపేందుకు ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సూచించారు. ఎప్పుడో పనులు పూర్తి చేస్తామనేది కాకుండా ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమిటి, ఆ పనిని పూర్తి చేయాలంటే ఎలా అధిగమించాలనే ఆలోచన చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అందుకోసం కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - 2023-03-05T00:26:34+05:30 IST