గిద్దలూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN, First Publish Date - 2023-04-20T00:05:32+05:30
తాను ఎన్నోసార్లు గిద్దలూరుకు వచ్చానని, ఇప్పుడు మీరు చూపిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గిద్దలూరు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
గిద్దలూరు, ఏప్రిల్ 19 : తాను ఎన్నోసార్లు గిద్దలూరుకు వచ్చానని, ఇప్పుడు మీరు చూపిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గిద్దలూరు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హ యాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1370 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి కృష్ణ జలాలను కుళాయి ద్వారా ఇచ్చేందుకు 340 కోట్లు మంజూరు చేయగా కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. నీటి సమస్య పట్ల చిత్తశుద్ది ఉంటే ఇలా రద్దు చేసేవారా అంటూ ప్రశ్నించారు. గిద్దలూరుకు గుండ్లమోటు నుంచి నీటిని ఇచ్చామని, అలాగే మరో 90 కోట్ల రూపాయలు శాశ్వత నీటి పథకానికి నిధులు మంజూరు చేయించగా ప్రస్తుతం నత్తనడకన నాలుగేళ్ల నుంచి పనులు చేస్తున్నారని అశోక్‌రెడ్డి విమర్శించారు. రాచర్ల గేటు వద్ద ఓవర్‌బ్రిడ్జి లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యను గమనించి బైపాస్ రోడ్డు, ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా ఈ నాలుగేళ్లలో పనులు మొదలు పెట్టలేదని విమర్శించారు. గిద్దలూరులో 100 పడకల ఆసుపత్రి, కంభంలో 50 పడకల ఆసుపత్రి మంజూరు చేయించామన్నారు. సగిలేరు నది నీటి ముంపు నుంచి కాపాడేందుకు 15 కోట్లు మంజూరు చేయించగా, ఆ టెండర్‌ను రద్దు చేశారన్నారు. 100 కోట్లతో 1408 టిడ్కో గృహాలను 85శాతం పూర్తి చేయగా నాలుగేళ్లలో మిగిలిన 15 శాతం పూర్తి చేయలేదన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ తాను అధికారంలోకి రాగానే ఏడాదిలోపే వెలిగొండను పూర్తిచేస్తానని, మార్కాపురంను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి తరలించి తాగునీటిని అందించేందుకు రద్దు అయిన 340 కోట్లను మంజూరు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాచర్లగేటు వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం, పట్టణానికి బైపాస్ రోడ్డు చేయిస్తానని, సగిలేరు ముంపు నుంచి పట్టణాన్ని కాపాడుతానని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని పేర్కొన్నారు.
రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తున్నదని, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఒంగోలు పార్లమెంటు కమిటీ అధ్యక్షులు బాలాజీ విమర్శించారు. టీడీపీ పథకాలను రద్దు చేయడం తప్ప కొత్తగా చేసిందేమిటని ప్రశ్నించారు. గిద్దలూరులో ప్రజలు స్వచ్ఛంధంగా తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేశారు.
టీడీపీ పాటలు ఆపమన్న పోలీసులు
గిద్దలూరు టౌన్, ఏప్రిల్ 19 : ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు గిద్దలూరు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీబొమ్మ నుంచి రోడ్డు షో ప్రారంభం కాగా ఆయన వాహనం కంటే ముందుగా ఉన్న లైటింగ్ వాహనంలో టీడీపీ పాటలు పెట్టారు. రోడ్డు షో స్థానిక పోలీసుస్టేషన్ సమీపంలోకి వచ్చిన సందర్భంలో టీడీపీ పాటలు పెట్టేందుకు అనుమతి లేదని, వెంటనే పాటలు ఆపాలని పోలీసులు వాహనంలో ఉన్న వారిని ఆదేశించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు మైకు తీసుకుని మిస్టర్ సీఐ తమాషాలు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటలు ఆపమనేందుకు మీకు ఏ అధికారాలు ఉన్నాయంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మీకు శిక్ష తప్పదు, వదిలిపెట్టనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో సైతం ఇదేవిషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ పాటలు పెట్టకూడదని సీఐఆపాడని, పోలీసులతో కూడా తప్పుడు పనులు జగన్ చేయిస్తున్నారని విమర్శించారు. పొద్దుటూరులో కానిస్టేబుల్ ఒకరు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారని, ఆ కేసు మేము టేకప్ చేస్తున్నామంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-20T00:05:32+05:30 IST